పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి?

ప్రశ్న: పాములు కుబుసం విడవడానికి కారణం ఏంటి? కుబుసం విడువని పాములూ ఉంటాయా?

Published : 11 Jun 2020 00:32 IST

ప్రశ్న: పాములు కుబుసం విడవడానికి కారణం ఏంటి? కుబుసం విడువని పాములూ ఉంటాయా?

- అల్లూరి వల్లీ గాయత్రి, పదో తరగతి, విశ్వేశ్వరాయపురం

అన్ని పాములు వాటి చర్మాన్ని కుబుసం రూపంలో విడుస్తాయి. మనం కూడా చర్మాన్ని విడుస్తాము! మనలో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి గుర్తించలేం. పాముల విషయంలో వాటి మొత్తం చర్మం కుబుసం రూపంలో ఒకేసారి విడుదల అవుతుంది. పాము శరీరంపై చర్మం ఒకానొక స్థితికి వచ్చేసరికి దాని శరీరంపై ఈ పాత చర్మం కింద.. కొత్త చర్మం పెరుగుతుంది. ఇది ఏర్పడడం పూర్తికాగానే పాతచర్మాన్ని పాము కుబుసం రూపంలో విసర్జిస్తుంది. ముఖ్యంగా పాత చర్మంపై ఉన్న సూక్ష్మ, పరాన్నజీవుల నుంచి తనను తాను కాపాడుకోవడానికీ పాముకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. కుబుసం విడిచేముందు నోటి దగ్గర పాత చర్మానికి ఓ చీలికను ఏర్పరుచుకుంటుంది. ఇందుకోసం పాము తన తలను గరుకు ప్రదేశంలో కానీ, రాయి మీద కానీ బాగా రుద్దుకుంటుంది. ఈ చీలిక నుంచి పాతచర్మాన్ని వదిలివేస్తూ అది బయటకు వచ్చేస్తుంది. దీన్నే కుబుసం విడవడం అంటారు. ఓ పాము సాధారణంగా ఏడాదికి రెండుసార్లు ఇలా చేస్తుంది.

- డాక్టర్‌.సి.వి.సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్సు పరిషత్తు, అమలాపురం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని