తాతయ్య మాట.. బంగారు బాట!

సాయంత్రం ఆరుగంటలైంది. పక్షులు గూళ్లకు చేరే వేళ.. ఓ ఇంటి ఆవరణలో ఉన్న చెట్ల మీద పిచ్చుకలు వాలాయి.

Updated : 24 Feb 2021 04:16 IST

సాయంత్రం ఆరుగంటలైంది. పక్షులు గూళ్లకు చేరే వేళ.. ఓ ఇంటి ఆవరణలో ఉన్న చెట్ల మీద పిచ్చుకలు వాలాయి. తమ పిల్లల కోసం ఏరికోరి తెచ్చిన ఆహారాన్ని వాటికి తినిపిస్తూ కిచకిచమని మురిసిపోతున్నాయి. రమేష్‌, సురేష్‌ అన్నదమ్ములు.. వీళ్లు చుట్టు పక్కల పిల్లలతో కలసి చిన్న చిన్న రాళ్లను పైకి విసురుతున్నారు. ఇంకొందరు కొంటె పిల్లలు చెట్ల కొమ్మలను పట్టుకొని ఊపుతూ పిచ్చుకలను ఎగురకొడుతూ గోల చేస్తున్నారు.
అప్పుడే బయట నుంచి వచ్చిన రమేష్‌, సురేష్‌ల తాతయ్యకు ఈ దృశ్యం కనిపించింది. వారు చేస్తున్న తుంటరి పనులకు ఆయన కాస్త ఆందోళన పడ్డారు. వెంటనే చిన్నారులందరినీ దగ్గరకు పిలిచి.. ‘పిల్లలూ! మీరంతా అలా గుంపుగా చేరి ఆ పిచ్చుకల మీద రాళ్లు విసురుతుంటే అవి ప్రాణభయంతో ఎలా గిలగిల్లాడిపోతున్నాయో చూడండి! పాపం పుణ్యం తెలియని ఆ మూగ జీవాలు పొద్దస్తమానం తిండి కోసం తిరిగి తిరిగి దొరికిన ఆహారం తెచ్చి గుచ్చి గుచ్చి తమ పిల్లల నోళ్లలో పెడుతున్నాయి. మీరంతా వాటిని చూసి ఆనందించక చెట్ల కొమ్మలు ఊపి, రాళ్లు రప్పలు వేసి ఇబ్బంది పెడితే ఎలా? పాపం..! అవి ఎవరితో చెప్పుకొంటాయి చెప్పండి’ అన్నాడు.
పిల్లలంతా తలలు కిందకు వేసుకున్నారు. ఇంతలో తాతయ్య మళ్లీ అందుకుని.. ‘అలా నోరులేని జీవుల్ని బాధించడం తప్పుకదా! అవి ఎవరికీ అపకారం చేయకుండా ఏదో ఆ చెట్ల మీద హాయిగా తమ బతుకు తాము బతుకుతున్నాయి. మీరేమో వాటిని రాళ్లతో కొట్టి చంపితే మహాపాపం కాదా! మీరే ఆలోచించండి’ అని కాస్త గట్టిగానే చెప్పాడు.
అంతటితో ఆ పిల్లలందరూ తమ చేతుల్లోని రాళ్లురప్పలను కింద పడేశారు. ‘నిజమే తాతయ్య! ఏదో సరదాకని కొట్టి.. వాటిని ఇబ్బంది పెట్టాం’ అని వాళ్లు తమ తప్పు ఒప్పేసుకున్నారు. అప్పుడు ఇంకా వాళ్ల బుర్రలకు ఎక్కేలా తెలియచెప్పాలనే ఉద్దేశంతో... ‘చూడండి పిల్లలూ! మిమ్మల్ని ఎప్పుడైనా సరే బడిలో మాస్టారు గానీ వేరెవరైనా కానీ కొడితే మీరు ఎలా ఏడుస్తారో.. అలాగే ఆ పిచ్చుకలు కూడా పాపం! బావురమని ఏడుస్తాయి. వచ్చే జన్మలో మీరు కూడా మాలాగే పిచ్చుకలై పుట్టండని శపిస్తాయి తెలుసా!’ అన్నాడు.
చిన్నారులంతా కంటతడి పెట్టారు. ‘చూడండి పిల్లలూ! అందుకే గాంధీగారు జీవహింస మహాపాపం అన్నారు. పూర్వం ఒకసారి శిబి చక్రవర్తి డేగ నుంచి పావురాన్ని కాపాడేందుకు తన శరీరం నుంచి మాంసాన్నే కోసి ఇచ్చారు. అందుకే మీరు ఇవన్నీ తెలుసుకుని సక్రమంగా మసలుకోండి. ఏ ప్రాణికి కూడా హాని చేయకండి. అలా ఉండటమే అహింస అని తెలుసుకోండి’ అని వారికి అర్థమయ్యేలా చెప్పాడు. అప్పటి నుంచి పిల్లలు బుద్ధిగా ఉండటం నేర్చుకున్నారు. పిచ్చుకల్ని కానీ మరే పక్షిని కానీ బాధించకుండా.. చక్కగా చెట్ల కింద కూర్చుని వాటి కిచకిచ ధ్వనులను వింటూ ఆనందించసాగారు.

- యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని