వ్యోమ్‌ అహుజా.. అద్భుత ప్రతిభ!

పిల్లలూ.. ‘మనం పదకొండేళ్ల వయసులో ఏం చేస్తాం?’ స్కూల్‌కెళ్లి బుద్ధిగా చదువుకుంటాం.. సాయంత్రం ఇంటికొచ్చాక హోంవర్క్‌ చేసుకొని ఆడుకుంటాం.. అంతే కదా! ఏదైనా రంగంలో అద్భుత ప్రతిభ

Published : 27 Feb 2021 00:11 IST

పిల్లలూ.. ‘మనం పదకొండేళ్ల వయసులో ఏం చేస్తాం?’ స్కూల్‌కెళ్లి బుద్ధిగా చదువుకుంటాం.. సాయంత్రం ఇంటికొచ్చాక హోంవర్క్‌ చేసుకొని ఆడుకుంటాం.. అంతే కదా! ఏదైనా రంగంలో అద్భుత ప్రతిభ చూపితే ఒకటో రెండో అవార్డులు తీసుకుంటాం. కానీ, ఓ బాలుడు మాత్రం చిన్న వయసులోనే బోలెడు రికార్డులు సాధించాడు.. లెక్కలేనన్ని అవార్డులు తీసుకున్నాడు.. ఇంతకీ అతడెవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖ్‌నవూ నగరానికి చెందిన వ్యోమ్‌ అహుజాకు ప్రస్తుతం పదకొండేళ్లు. గత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి బాలశక్తి పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. చదువుతో పాటు ఇతర రంగాల్లో విశేష ప్రతిభ చూపుతున్నందుకు అతడికి ఈ ఘనత లభించింది.  
తొమ్మిది వాయిద్యాలపై పట్టు
వ్యోమ్‌ అహుజా తొమ్మిది విభిన్న వాయిద్యాలను వాయించడంలో దిట్ట. వేణువు(ఫ్లూట్‌), మౌత్‌ ఆర్గాన్‌, డ్రమ్స్‌, సింథసైజర్‌, శంఖం, గిటార్‌ ఇలా వివిధ వాయిద్యాలపై బాలుడికి పట్టు ఉంది. నాలుగేళ్ల వయసులోనే వేణువు ద్వారా పాటలు పాడేవాడట. అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చాడట. వీటితో పాటు క్రీడలు, కరాటే తదితర అంశాల్లోనూ ప్రతిభ ఇతడి సొంతం.
ఎన్నో అవార్డులు, పురస్కారాలు
తొమ్మిదేళ్ల వయసులో బంగీ జంపింగ్‌లో ఆసియాలోనే అతి పిన్నవయస్కుడిగా వ్యోమ్‌ రికార్డు సృష్టించాడు. రెండుసార్లు అధ్యయన రంగంలో ‘ఫ్యూచర్‌ కలాం’ అవార్డును కూడా అందుకున్నాడు. ఇప్పటికే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో 28 సార్లు తన పేరు నమోదు అయింది. ఈ నెల 13న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ చేతుల మీదుగా ప్రధానమంత్రి బాలశక్తి పురస్కారం, ప్రశంసాపత్రం, రూ.51వేల చెక్కును వ్యోమ్‌ అందుకున్నాడు. అంతేకాదు.. 19వ తేదీన నగరంలో బాగా పేరున్న ఓ స్కూల్‌ యాజమాన్యం అతడిని సన్మానించి రూ.లక్ష చెక్కును అందించింది. ఇవే కాక.. మరెన్నో సంస్థలు, యాజమాన్యాలు చిన్న వయసులోనే చదువుతో పాటు ఇతర రంగాల్లో బాలుడి ప్రతిభకు గుర్తింపుగా సన్మానం చేశాయి. ఈ నేస్తం భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని మనం కూడా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం..!!

- లఖ్‌నవూ, ఈనాడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని