నాన్నకు ప్రేమతో..

నడవలేని నాన్న కోసం ఓ కూతురు అమ్మలా ఆలోచించింది.. ఏదో చేయాలని ఆరాటపడింది.. దానిలోంచి ఓ ఆవిష్కరణ వచ్చింది.. అది వాళ్ల తండ్రి కష్టాలనే కాదు.. ఇంకా ఎంతోమంది అవస్థలనూ దూరం చేయనుంది.. ఆ ఆవిష్కరణ ఏంటో.. ఆ విశేషాలేంటో ఈ రోజు

Published : 02 Mar 2021 01:07 IST

నడవలేని నాన్న కోసం ఓ కూతురు అమ్మలా ఆలోచించింది.. ఏదో చేయాలని ఆరాటపడింది.. దానిలోంచి ఓ ఆవిష్కరణ వచ్చింది.. అది వాళ్ల తండ్రి కష్టాలనే కాదు.. ఇంకా ఎంతోమంది అవస్థలనూ దూరం చేయనుంది.. ఆ ఆవిష్కరణ ఏంటో.. ఆ విశేషాలేంటో ఈ రోజు తెలుసుకుందామా!
హాయ్‌.. నేస్తాలూ.. ఈ అక్క పేరు షేక్‌ బషీరా. నల్గొండ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. వీళ్లది పేద కుటుంబం. నాన్న పేరు ఖయ్యూం బాషా. ఆయన పక్షవాతం వల్ల కొన్ని సంవత్సరాలుగా చక్రాల కుర్చీకే పరిమితమై ఉన్నారు. వస్తువులు అందుకునే ప్రయత్నంలో ఆయన కొన్ని సార్లు కిందపడి గాయాలపాలయ్యారు. ఇదంతా కూతురైన బషీరాకు కన్నీళ్లు తెప్పించింది. నాన్న కోసం ఏదైనా చేయాలి అనుకుంది.
ఆలోచన వచ్చిందే తడవుగా..
చక్రాలకుర్చీ కాస్త ఎత్తుకు లేస్తే నాన్న పైనున్న వస్తువులనూ ఎవరి సహాయమూ లేకుండా అందుకోగలరు కదా! అనే ఆలోచన వచ్చింది. వెంటనే స్కూలులో టీచర్‌తో ఈ విషయాన్ని పంచుకుంది. ఆమెకు నచ్చడంతో ప్రాజెక్టు ప్రారంభించారు. బషీరాతోపాటు మరో ఇద్దరు విద్యార్థులు బృందంగా, ఉపాధ్యాయురాలి పర్యవేక్షణలో హైడ్రాలిక్‌ చక్రాల కుర్చీ నమూనా తయారు చేశారు. ఇది పాస్కల్‌ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. రిపేర్‌ సెంటర్లో కార్లను హైడ్రాలిక్‌ సాయంతో పైకి ఎత్తుతారు కదా.. అదే స్ఫూర్తితో బషీరా దీన్ని తయారు చేసింది.
బ్యాటరీ సాయంతో..
చక్రాల కుర్చీ కింద ఉండే హైడ్రాలిక్‌ వ్యవస్థ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. కుర్చీ పైకి లేవాలనుకున్నప్పుడు హ్యాండిల్‌ దగ్గర ఉన్న బటన్‌ నొక్కితే చాలు హైడ్రాలిక్‌ యూనిట్‌ పనిచేసి కుర్చీ పైకి లేస్తుంది. పని పూర్తైన తర్వాత అదే బటన్‌ సాయంతో కుర్చీని తిరిగి కిందకు దించుకోవచ్చు. ఈ జనవరిలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’లో కుర్చీ నమూనాను ప్రదర్శించారు. దీన్ని మంత్రి కేటీఆర్‌ చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆలోచన ఎలా వచ్చిందని ఆరా తీశారు. విషయం మొత్తం విని బషీరాను ఎంతో మెచ్చుకున్నారు. వాళ్ల కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లును కూడా మంజూరు చేశారు. కేవలం తొమ్మిదో తరగతి చదువుతూ ఇంత మంచి ఆవిష్కరణ చేసిన బషీరా అక్క నిజంగా గ్రేట్‌ కదా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని