సంప్రదాయ పోటీలకు చిన్నారి సాధన!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం, పద్ధతి ఉంటుందని తెలుసు కదా! కొన్నిచోట్ల పూర్వ కాలం నుంచి వచ్చే ఆచారాల ప్రకారం.. ఏటా ఏదైనా పండక్కో, ఆ తర్వాతో వివిధ పోటీలు

Published : 10 Mar 2021 00:44 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం, పద్ధతి ఉంటుందని తెలుసు కదా! కొన్నిచోట్ల పూర్వ కాలం నుంచి వచ్చే ఆచారాల ప్రకారం.. ఏటా ఏదైనా పండక్కో, ఆ తర్వాతో వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు. సంప్రదాయ ఆటలు చాలావరకు సాహసోపేతంగానే ఉంటాయి. అటువంటి ఆటలో ఓ చిన్నారి నేను సైతం అంటూ ముందుకొస్తోంది. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!  
ర్ణాటక రాష్ట్రంలో ఏటా కంబళ పోటీలు జరుగుతుంటాయి. ఎద్దులు లేదా దున్నపోతుల జతతో తక్కువ సమయంలో పరుగెత్తి లక్ష్యాన్ని చేరడమే ఈ పోటీల ఉద్దేశం. ఇందులో సాధారణంగా ఎంతో అనుభవమున్న పెద్దవాళ్లే పాల్గొంటారు. కానీ, ఉడిపి జిల్లాలో ఇటీవల జరిగిన పోటీల్లో 11 సంవత్సరాల చైత్ర భట్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంటే.. తాను పోటీలో పాల్గొనకపోయినా, తండ్రి పరమేశ్వర భట్‌ తరఫున దున్నపోతులను బరిలోకి తీసుకొచ్చింది. అంతేకాదు.. ఇప్పటికే వాళ్ల పొలం దగ్గరున్న 110 మీటర్ల ట్రాక్‌పై సాధన కూడా చేస్తుందట.  

తండ్రి వద్దే శిక్షణ
ఎప్పటికైనా కంబళ పోటీల్లో పాల్గొనాలనేది తన లక్ష్యమని చైత్ర చెబుతోంది. రెండు దశాబ్దాలుగా పోటీల్లో పాల్గొంటున్న తన తండ్రి దగ్గరే చిన్నారి ప్రస్తుతం శిక్షణ తీసుకుంటోంది. ‘చైత్రకు కంబళ పోటీలంటే చాలా ఆసక్తి. ఇంటి దగ్గర దున్నపోతులకు తానే మేత వేస్తూ.. వాటి ప్రవర్తనను గమనిస్తుంటుంది. ఎక్కడైనా పోటీలు జరిగితే తనను కూడా తీసుకెళ్తున్నా’ అని ఆమె తండ్రి చెబుతున్నాడు. చైత్ర కోసం చిన్న దున్నపోతును కొన్నారట. దానికి ‘గణేషా’ అని పేరు కూడా పెట్టారు. చదువుకు ఇబ్బంది లేకుండా.. ఆ బుజ్జి పిల్లతోనే ప్రస్తుతం సాధన చేస్తుందట. అన్నీ కుదిరితే కూతురిని కంబళ అకాడమీలో చేర్పిస్తానని తండ్రి వివరించాడు. దున్నపోతులు, ఎద్దుల దగ్గరకు వెళ్లాలంటేనే మనం భయపడతాం.. అలాంటిది చైత్రకు ఎంత ధైర్యమో కదూ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని