వేగంలో మేటి.. లేరెవరూ పోటీ!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. వేగంగా పరుగెత్తే జంతువు అనగానే మనకు చిరుత పులి గుర్తొస్తుంది. వాటి తర్వాత గుర్రం, జింకలు, కుందేళ్ల పేర్లు చెబుతాం కదా! ఇవన్నీ కేవలం భూమి మీదే వేగంగా పరుగెత్తగలవు.

Updated : 12 Mar 2021 00:45 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. వేగంగా పరుగెత్తే జంతువు అనగానే మనకు చిరుత పులి గుర్తొస్తుంది. వాటి తర్వాత గుర్రం, జింకలు, కుందేళ్ల పేర్లు చెబుతాం కదా! ఇవన్నీ కేవలం భూమి మీదే వేగంగా పరుగెత్తగలవు. ‘మరి నీటిలో వేగంగా వెళ్లే జీవి ఏది అంటే?’ చాలామందికి తెలియదు. అందుకే ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం..!!
బ్లాక్‌ మార్లిన్‌.. చేపల్లో అరుదైన రకానికి చెందినది. ఇవి హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాలు.. వాటి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మార్లిన్‌ జాతిలో మొత్తం ఏడు రకాలు ఉంటాయి. వాటిలో ఇదొకటి. చూసేందుకు ముక్కు చేపలా కనిపించే దీని పై దవడ పెద్దగా, కత్తిలా ఉంటుంది. శరీరం మాత్రం ముదురు నీలం రంగులో ఉంటుంది. పొట్ట భాగం ఓ రకమైన తెలుపు రంగులో మెరుస్తుంటుంది. ఈ చేప వీపు మీద ఉండే రెక్క నలుపు లేదా ముదురు నీలం రంగులో ఉంటుంది.
నెలవంకలా తోక
ప్రపంచంలోనే వేగవంతమైన జీవుల్లో బ్లాక్‌ మార్లిన్‌ ఒకటి. ఇవి వేడి నీటి ప్రాంతాల్లో వందలు, కొన్నిసార్లు వేలాది మైళ్ల దూరం వలస వెళ్తుంటాయి. ఈ చేపలు గంటకు అత్యధికంగా 129 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవట. అంటే, గంటకు 80 నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణించే చిరుత పులి, 80 కిలోమీటర్లు వెళ్లగల జింక కంటే వీటి వేగమే ఎక్కువ అన్నమాట. అంతేకాదు.. ఈ చేపలు నీటి ఉపరితలంపై 70 నుంచి 80 అడుగుల దూరం వరకు ఎగరగలవు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. మార్లిన్‌ చేపల తోక నెలవంక ఆకారంలో ఉంటుంది. ఈ నిర్మాణమే చేపకు మరింత వేగంగా వెళ్లగలిగేలా తోడ్పడుతుందట.

విశాఖపట్నంలో కనిపించింది..
సాధారణంగా మహాసముద్రాల్లోనే కనిపించే బ్లాక్‌ మార్లిన్‌.. ఇటీవల విశాఖపట్నంలో జాలర్ల వలలో చిక్కింది. పది రోజులు కష్టపడి దాన్ని పట్టుకున్నారట. దాదాపు 78 కేజీల బరువున్న ఆ చేపను హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఓ హోటల్‌లో ప్రదర్శనగా ఉంచారు. తర్వాత ఓ యూట్యూబ్‌ ఛానల్‌ వాళ్లు దాన్ని  కొనుగోలు చేశారు.  
చిన్న జంతువులే ఆహారం
బ్లాక్‌ మార్లిన్‌ జాతిలో మగ చేపలు అయిదేళ్లు, ఆడవి పన్నెండేళ్లు బతుకుతాయి. 4.6 మీటర్ల వరకు పొడవు, 750 కిలోల వరకు బరువు పెరుగుతాయట. చిన్న చిన్న చేపలు, ఆక్టోపస్‌లను ఆహారంగా తీసుకుంటాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే వీటి మాంసానికి భారీ డిమాండ్‌ ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు