అయిదేళ్ల బుడత అద్భుత ప్రతిభ!

మన దగ్గర ఇప్పుడిప్పుడే స్కేటింగ్‌ పట్టణాల వరకు చేరుతోంది. స్కేట్‌బోర్డింగ్‌ మాత్రం మనకు కొత్తే! స్కేటింగ్‌ కన్నా...

Updated : 16 Mar 2021 00:39 IST

మన దగ్గర ఇప్పుడిప్పుడే స్కేటింగ్‌ పట్టణాల వరకు చేరుతోంది. స్కేట్‌బోర్డింగ్‌ మాత్రం మనకు కొత్తే! స్కేటింగ్‌ కన్నా... స్కేట్‌బోర్డింగ్‌ చేయడమే మరింత కష్టం. చాలా బ్యాలెన్సింగ్‌ మెలకువలు అవసరం అవుతాయి. కానీ కేరళకు చెందిన అయిదేళ్ల బుడత చిరుతలా విన్యాసాలు చేస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన అయిదేళ్ల చిన్నారి జానకీ ఆనంద్‌ ఇటీవల ఓ విన్యాసం చేసింది. అదేంటంటే తిరగబడి ఉన్న స్కేట్‌బోర్డుపై దూకి దాన్ని యథాస్థానంలోకి తెచ్చి దానిపై నిలబడటం. చదువుతుంటే ఓస్‌ అంతేనా! అనిపించవచ్చు.. కానీ చేయడం చాలా కష్టం. కఠిన శిక్షణ తీసుకున్న ప్రొఫెషనల్స్‌కే ఇది సాధ్యం. కానీ ఈ బుడత కొన్ని ప్రయత్నాల్లోనే చేసి చూపించింది.
ఒక్క రోజులోనే వైరల్‌
కాస్త ఎత్తులో ఉన్న సిమెంటు దిమ్మ మీద నుంచి స్కేట్‌బోర్డుతో సహా కిందకు దూకి బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగింది. ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసిన 24 గంటల్లోనే ఈ వీడియో వైరల్‌ అయింది. జానకీ ఆనంద్‌ ప్రతిభకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో మన దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన స్కేట్‌బోర్డర్‌గా మారింది.
అన్నయ్య కోసం తెస్తే..
జానకి వాళ్ల నాన్న పేరు ఆనంద్‌. ఆయన జానకి అన్నయ్య రెహాన్‌ కోసం స్కేటింగ్‌ బోర్డు తీసుకొచ్చారు. కానీ దాని మీద జానకికి తెగ ఆసక్తి కలిగింది. అప్పుడామె వయసు కేవలం రెండేళ్లు. సోఫాను ఆసరగా చేసుకుని స్కేట్‌బోర్డుపై తనను తాను బ్యాలన్స్‌ చేసుకోవడం నేర్చుకుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకొని స్కేట్‌బోర్డుపై ప్రస్తుతం మరింత పట్టు సాధించింది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ సైతం నడుపుతూ.. అందులో స్కేట్‌ బోర్డింగ్‌లో మెలకువలూ చెబుతోంది. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే తన ధ్యేయమని ఈ చిన్నారి అంటోంది. మరి ఇంకెందుకాలస్యం జానకీ ఆనంద్‌కు ఆల్‌ది బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని