భలే.. భలే.. బ్యాడ్జీలోయ్‌!

నేస్తాలూ.. మీకు బటన్‌ బ్యాడ్జీలు తెలుసుగా! అదేనండి.. మనం స్కూలుకు వెళ్లేటప్పుడు బడిపేరు, లోగోతో ఉంటుంది చూశారు.

Published : 28 Mar 2021 01:32 IST

నేస్తాలూ.. మీకు బటన్‌ బ్యాడ్జీలు తెలుసుగా! అదేనండి.. మనం స్కూలుకు వెళ్లేటప్పుడు బడిపేరు, లోగోతో ఉంటుంది చూశారు. దాన్ని మనం టైకి కానీ చొక్కాకు కానీ గుచ్చుకొంటాం కదా..! ఆ.. దాన్నే బటన్‌ బ్యాడ్జీ అంటారు. ఓ ఇద్దరు ఇలాంటివి కొన్ని వేలు సేకరించి ఏకంగా ఓ మ్యూజియం పెట్టేశారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

మెరికాకు చెందిన క్రిస్టెన్‌, జోయెల్‌ కార్టెర్‌ తోబుట్టువులు. వాళ్లకు రకరకాల బ్యాడ్జీలు సేకరించడమంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి వాటిని సేకరిస్తూ బోలెడు పోగు చేశారు. 1995 నుంచి వీటిని తయారు చేయడమూ మొదలు పెట్టారు. వాటి ప్రదర్శన కోసం ఒక గ్యాలరీ ఆరంభించారు. అందులో పాతవి, కొత్తవి అన్నీ ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మ్యూజియాన్ని సందర్శించాలంటే, చికాగోలోని ఆర్మిటేజ్‌ అవెన్యూకు వెళ్లాల్సిందే!

చరిత్రను చాటి చెప్పాలని..
ఆ తర్వాత ఈ బ్యాడ్జీలు చాలా ఏళ్ల నాటివి కాబట్టి వాటి ద్వారా తమ దేశ చరిత్రను చాటి చెప్పాలనుకున్నారు. అంతే, 2010 ఆగస్టులో ‘బిజీ బీవర్‌ బటన్‌ మ్యూజియం’ ప్రారంభించారు. దాంతో ప్రపంచంలోనే ఏకైక ‘పిన్‌ బ్యాక్‌ బటన్‌’ (బ్యాడ్జీ) మ్యూజియంగా దీనికి గుర్తింపొచ్చింది. క్రిస్టెన్‌, కార్టెర్‌కు తోడు క్రిస్‌ వారె అనే కార్టూనిస్టు, ప్రాన్సిన్‌ స్పైగల్‌ అనే చిత్రకారులు ఈ బ్యాడ్జీలను రూపొందించడానికి సాయపడ్డారు.

ఎన్నెన్నో బ్యాడ్జీలు..
మొదటి బ్యాడ్జీ 1896లో పేటెంట్‌ పొందింది. అప్పటి బ్యాడ్జీలు మరెన్నో ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాదు.. ఒకప్పటి అమెరికా అధ్యక్షులు జార్జ్‌ వాషింగ్టన్‌, అబ్రహాం లింకన్‌ వారి ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించినవి కూడా చూడొచ్చు. ఇక్కడ దాదాపు 30,000 పిన్నులు, అన్ని రకరకాల ఆకారాలు, పరిమాణాలు, రంగులు, ఆకృతుల్లో లభిస్తాయి. రాజకీయ, చిత్ర, ప్రకటన, క్రీడ, సామాజిక, సంగీత కేటగిరీలకు సంబంధించినవీ దొరుకుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక్కడ దొరకని విభాగం అంటూ ఏదీ లేదు!

నాటి సంస్కృతికి సాక్ష్యాలు
ఈ బటన్ల మీద ఉన్న బొమ్మలు నాటి సంస్కృతి, వ్యక్తిగత చరిత్రను తెలియజేస్తాయి. అంతేనా! అలంకరణలో భాగంగా రోజూ ధరించేవి కూడా ఉన్నాయండోయ్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని