బుజ్జి పిట్ట.. బుల్లి పిట్టా.. నీకు నీళ్లు కావాలా!

ఎండ సురుక్కుమంటోంది.. వడగాలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్ని నీళ్లు తాగినా వెంటనే దాహం వేస్తోంది. మనుషులం మనకే ఇలా ఉంటే..

Published : 04 Apr 2021 02:06 IST

చూడండి చెయ్యండి

ఎండ సురుక్కుమంటోంది.. వడగాలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్ని నీళ్లు తాగినా వెంటనే దాహం వేస్తోంది. మనుషులం మనకే ఇలా ఉంటే.. ఇక పక్షుల సంగతి చెప్పక్కర్లేదు! అసలే అవి అల్పప్రాణులు. పాపం ఎండాకాలంలో సమయానికి గుక్కెడు నీరు దొరకక తెగ ఇబ్బంది పడుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలూ కోల్పోతుంటాయి. అందుకే మనం ఈ రోజు బుల్లిపిట్టల దాహం తీర్చే క్రాఫ్ట్‌ చేయడం ఎలాగో నేర్చుకుందామా..

కావాల్సిన వస్తువులు

1.పాత డబ్బా మూత 2.ప్లాస్టిక్‌ నీళ్ల సీసా 3.జిగురు 4.ఒక స్క్రూ 5.చెక్కముక్క 6.తీగ ముక్కలు

ఎలా చేయాలంటే..
అమ్మను అడిగి ఓ పాత డబ్బా మూత తీసుకోండి. అది కాస్త లోతుగా ఉండాలి. అప్పుడే అందులో కొన్ని నీళ్లు నిల్వ ఉంటాయి. దాని మధ్యలో ప్లాస్టిక్‌ నీళ్ల సీసా మూతను జిగురు సాయంతో అతికించాలి. దానికి ప్లాస్టిక్‌ నీళ్ల సీసాను బిగించుకునేలా అమర్చుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్‌ డబ్బా మూతకు అతికించిన నీళ్ల సీసా మూతకు మధ్యలో అమ్మానాన్న సాయంతో రంధ్రం చేయాలి. ఓ స్క్రూను బిగించుకోవాలి. నీళ్లు బయటకు కారిపోకుండా.. దాన్ని గమ్‌తో సీల్‌ చేసుకోవాలి. సీసాలో నీళ్లు నింపిన ప్రతిసారి సీసా మూత ప్లాస్టిక్‌ డబ్బా మూత నుంచి ఊడి రాకుండా పట్టి ఉంచడం కోసమే ఈ ఏర్పాటు అన్నమాట.

ఇక ఇప్పుడు స్కేలులాంటి ఒక చెక్కముక్కను తీసుకుని దాన్ని చిత్రంలో చూపించినట్లు ప్లాస్టిక్‌ డబ్బా మూతకు అతికించుకోవాలి. ఇది రెండువైపులా పక్షులు నిలుచొని నీళ్లు తాగేందు కోసం ఉపయోగపడుతుంది. ఒకేసారి నాలుగు పక్షులు నీళ్లు తాగాలనుకుంటే ఇలాంటి చెక్కముక్కనే అడ్డంగా కూడా అతికించుకోండి. అంటే ‘ప్లస్‌’ గుర్తులా అన్నమాట.

తర్వాత నీళ్ల సీసా మూతి దగ్గర చిన్న రంధ్రం చేసుకోండి. నీళ్లసీసా అడుగున చిత్రంలో చూపించినట్లు తీగముక్కతో కట్టుకోండి. మరో తీగను తీసుకుని సీసా తలకిందులుగా వేలాడేందుకు సాయపడేలా కట్టుకోండి. సీసాలో నీళ్లు నింపండి. ఇంతకు ముందే సిద్ధం చేసి పెట్టుకున్న పాత డబ్బామూతను తీసుకోండి. దాని మధ్యలో ఉండే నీళ్లసీసా మూత సీసాకు బిగుసుకునేలా తిప్పండి. ఇప్పుడు నీళ్లసీసాను తలకిందులుగా పెరట్లోని చెట్టు కొమ్మకు కానీ.. డాబా మీద కానీ వేలాడదీయండి. పక్షులు వచ్చి నీళ్లు తాగుతాయి. అవి తాగిన మేర నీళ్లు సీసాలోంచి ప్లాస్టిక్‌ డబ్బా మూతలోకి వస్తుంటాయి. ఇలా మూడు నుంచి నాలుగు రోజుల వరకు పక్షులకు ఉపయోగపడతాయి. ఒక వేళ మీరు ఊరెళ్లినా వాటికి ఇబ్బందేం ఉండదు. మొత్తానికి భలే ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని