నేలైనా.. నీరైనా..రయ్‌..రయ్‌..!

‘‘కీక్‌.. కీక్‌.. అని హారన్‌ మోగించుకుంటూ ఓ బైక్‌ వస్తోంది... వస్తోంది.. వచ్చేసింది! అరరె.. ఏంటది రోడ్డు దిగింది. అయ్యో.. అంకుల్‌ మిమ్మల్నే.. బ్రేక్‌ వేయండి ముందు పే..ద్ద చెరువుంది. అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో... బైక్‌ నీళ్లలోకి వెళ్లిపోయిందే..

Updated : 10 Apr 2021 04:51 IST

‘‘కీక్‌.. కీక్‌.. అని హారన్‌ మోగించుకుంటూ ఓ బైక్‌ వస్తోంది... వస్తోంది.. వచ్చేసింది! అరరె.. ఏంటది రోడ్డు దిగింది. అయ్యో.. అంకుల్‌ మిమ్మల్నే.. బ్రేక్‌ వేయండి ముందు పే..ద్ద చెరువుంది. అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో... బైక్‌ నీళ్లలోకి వెళ్లిపోయిందే.. హుమ్‌..ఇదేంటి నీళ్లలో మునిగిపోకుండా స్టీమర్‌లా రివ్వున దూసుకుపోతోంది. భలే ఉందే!..’’ ఈ బైక్‌ను చూసిన వాళ్లు ఎవ్వరైనా సరే ఇలా ఆశ్చర్యపోవాల్సిందే!!
అచ్చం జేమ్స్‌బాండ్‌ సినిమాలోలా నేలమీదా.. నీళ్లమీదా దూసుకెళ్లగలిగే ఈ బైక్‌ పేరు బిస్కీ! పేరు భలే గమ్మత్తుగా ఉంది కదూ! దీనిలో 55 హెచ్‌పీ సామర్థ్యమున్న డబుల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ బైక్‌ నేల మీద నుంచి నీటిలోకి వెళ్లిన అయిదు సెకండ్లలోనే తనను తాను మార్చుకుంటుంది. నీటిమీద నడిచేలా సిద్ధమైపోతుంది.

వేగంలో మిన్న
ఈ బిస్కీ నేల మీద గంటకు గరిష్ఠంగా సుమారు 128 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. అదే నీళ్లమీద దాదాపు 59 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. నీళ్లలో ఈ వేగం అంటే మాటలు కాదు. ఈ బైక్‌ ఇంచుమించుగా 227 కిలోల బరువుంటుంది. దీన్ని ఇంగ్లాండ్‌కు చెందిన ఓ ఆటోమొబైల్‌ సంస్థ రూపొందించింది. ఇంకేం.. ఎంచక్కా నాన్నతో చెప్పి ఓ బిస్కీని కొనేసుకుందాం.. హాయిగా నీళ్లలోనూ జామ్‌..జామ్‌ అని తిరిగేయొచ్చు అని అనుకుంటున్నారేమో.. అదేం కుదరదు. ఎందుకంటే ఇది ఇంకా మార్కెట్‌లోకి రాలేదు మరి! మొత్తానికి ఇవండీ బుజ్జి బిస్కీ విశేషాలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని