విద్యుత్తు ఎవరికీ ఊరికే రాదు..

విద్యుత్తు చాలా విలువైంది.. అస్సలు వృథా చేయొద్దు.. పొదుపుగా వాడాలి.. డబ్బులు మిగుల్చుకోవడం కోసం మాత్రమే కాదు... పర్యావరణాన్ని కాపాడి ముందు తరాలకు కానుకగా ఇవ్వడం కోసం.. ఇదంతా చెబుతోంది ఓ 12 ఏళ్ల బుడత! ఇంత చిన్న

Published : 26 Apr 2021 00:38 IST

విద్యుత్తు చాలా విలువైంది.. అస్సలు వృథా చేయొద్దు.. పొదుపుగా వాడాలి.. డబ్బులు మిగుల్చుకోవడం కోసం మాత్రమే కాదు... పర్యావరణాన్ని కాపాడి ముందు తరాలకు కానుకగా ఇవ్వడం కోసం.. ఇదంతా చెబుతోంది ఓ 12 ఏళ్ల బుడత! ఇంత చిన్న వయసులో ఎంత సామాజిక స్పృహో కదా! ఆ చిన్నారి కేవలం చెప్పి వదిలేయడం లేదు. అవగాహనా కల్పిస్తోంది. ర్యాలీలు తీస్తోంది. సదస్సులూ నిర్వహిస్తోంది.. ఇంతకీ ఎవరీ చిట్టితల్లి?

తూర్పుగోదావరి జిల్లా ఏనుగుపల్లి గ్రామానికి చెందిన అడపాల మహి ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. సమయం దొరికితే చాలు తోటివారికి పర్యావరణం మీద అవగాహన కల్పిస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా విద్యుత్తు పొదుపు గురించి వివరిస్తుంది. కరెంటును ఆదా చేస్తే ఆ మేరకు ప్రకృతికి మేలు చేసినట్లే అని చెబుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలని ర్యాలీలు, సదస్సుల్లో నినదిస్తోంది.
తన వంతుగా..
మహి.. కేవలం ఉపన్యాసాలు, మాటలకే పరిమితం కాలేదు. తన వంతుగా దాదాపు 250 మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తోంది. ఇప్పటి వరకు 25 పాఠశాలలను సందర్శించి అక్కడి విద్యార్థులకు మొక్కల పెంపకం, విద్యుత్తు పొదుపు మీద అవగాహన కల్పించింది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఎల్‌ఈడీ బల్బులు వాడాలని, అవసరం ఉన్నప్పుడే కరెంటును ఖర్చు చేయాలని, ఎవరూ లేనప్పుడు బల్బులు, ఫ్యాన్లు తిరగకుండా స్విచ్‌లు ఆపేయాలని వివరించింది. చూస్తే ఇవన్నీ చిన్నగానే కనిపించినప్పటికీ ఇలా చేయకపోతే పర్యావరణానికి ఎంతో కీడు జరుగుతుందని చెబుతోంది.

అప్పటి నుంచి..
పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో మహికి పర్యావరణం మీద ఇంత స్పృహ ఎలా వచ్చిందో తెలుసా..? 2019లో ఆమె అప్పటి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. ఎందుకంటే విద్యుత్తు పొదుపు, పర్యావరణ పరిరక్షణ మీద చిన్నారి వేసిన చిత్రానికి విద్యుత్తు మంత్రిత్వ శాఖవారు బహుమతి ఇచ్చారు. ఈ సందర్భంలో ఆమె ఈ చిన్నారిని ప్రశంసించారట. పర్యావరణ పరిరక్షణకు ఇంకా కృషి చేయమని ప్రోత్సహించారట. దీంతో తనకు వచ్చిన అవార్డుకు న్యాయం చేయాలనుకుంది మన మహి. అప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతోంది. చిన్నారి సంకల్పానికి ముచ్చట పడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కూడా సదస్సుల ఏర్పాటులో సాయం చేశారట. ‘పర్యావరణ పరిరక్షణ ధ్యాసలో పడి తన కోసం సమయమే కేటాయించుకోవడం లేదు.. నిర్విరామంగా సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తోంది. ఆరోగ్యం దెబ్బతింటుందో ఏమో!’ అని మహి వాళ్ల అమ్మానాన్న కంగారుపడ్డ రోజులూ ఉన్నాయంట. ప్రస్తుతం నాన్న సహకారంతో నిర్వహిస్తున్న తన ట్విట్టర్‌ ఖాతాలోనూ పర్యావరణం మీద అవగాహన కల్పిస్తోంది. నిజంగా మహి గ్రేట్‌ కదా..! మరి మనమూ వీలైనన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని