వారెవ్వా.. అనిరుధ్‌!

వయసు ఏడేళ్లు.. చదివేది ఒకటో తరగతి ఈ ఈడు పిల్లలు ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు రైమ్స్‌ బట్టీ పడుతూ...

Published : 30 Apr 2021 00:18 IST

వయసు ఏడేళ్లు.. చదివేది ఒకటో తరగతి ఈ ఈడు పిల్లలు ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు రైమ్స్‌ బట్టీ పడుతూ.. టేబుల్స్‌తో కుస్తీ పడుతూ.. ఉంటారు.. కానీ ఈ బుడతడు మాత్రం ఏకంగా ‘ఏసియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కాడు.. ఇందుకోసం ఈ సిసింద్రీ ఏం చేశాడో తెలుసా!

మిళనాడుకు చెందిన ఈ చిన్నారి పేరు అనిరుధ్‌. తన జ్ఞాపకశక్తితో.. రికార్డులు కొల్లగొడుతున్నాడు. తనకు రెండేళ్ల వయసు నుంచే డైనోసార్లంటే విపరీతమైన ఇష్టం. లెక్కలు కూడా చాలా వేగంగా చేయగలడు. తనకు నాలుగేళ్లు వచ్చేటప్పటికే మిలియన్‌, బిలియన్‌ వరకూ సంఖ్యలు నేర్చుకున్నాడు. డైనోసార్లు.. వాటిలో రకాలు.. వాటి పేర్లనూ అవలీలగా చెప్పగలడు. తనలో ఉన్న ఆసక్తిని గమనించిన వాళ్ల అమ్మానాన్న కూడా మరింత ప్రోత్సహించారు. ఈ క్రమంలో రికార్డు కోసం ప్రదర్శన ఇవ్వడానికి వారం ముందు నుంచే సాధన చేశాడు. అందులో వాళ్లు చూపించిన డైనోసార్ల పేర్లు, ఇచ్చిన సంఖ్యలను లెక్కించి టక్కున జవాబులు చెప్పేశాడు.  
లెక్కలు లెక్కే కాదు!
దోహాలో ఒకటో తరగతి చదువుతున్న అనిరుధ్‌ 300 డైనోసార్‌ జాతుల పేర్లు టపీటపీమని చెప్పేయగలడు. ఇంకా తన దగ్గర బోలెడు డైనోసార్ల బొమ్మలూ ఉన్నాయి. ఇక లెక్కలైతే ఇరగదీస్తాడు. మనలా చేతులతో లెక్కపెట్టి, పలక మీద గీతలు గీసి మాత్రం  కాదు. ఇలా అడుగుతుండగానే మనసులోనే లెక్క పెట్టి క్షణాల్లో జవాబిచ్చేస్తాడీ చిచ్చరపిడుగు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు అన్నీ కొట్టినపిండే.
సెలవులు వృథా చేయకుండా...
గతేడాది కరోనా వల్ల బడులకు సెలవులు ఇచ్చేశారు కదా! ఆ సమయాన్ని వృథా చేయకుండా రికార్డులు నెలకొల్పాలని దృష్టి పెట్టాడు. డిసెంబరు 2020లో ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం పొందాడు. సరిగ్గా మూడు నెలలు గడవక ముందే ఫిబ్రవరి 2021లో ‘ఏసియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకున్నాడు. ఇలాంటి రికార్డులు ఇంకా.. మరెన్నో సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాడీ అనిరుధ్‌. భవిష్యత్తులో తాను వ్యోమగామిగా మారి అంగారక గ్రహం మీదకు వెళ్లాలనుకుంటున్నాడు. ఇంకా తనకు కోడింగ్‌, రోబోటిక్స్‌ అంటే కూడా చాలా ఇష్టమట. మొత్తానికి మన అనిరుధ్‌ చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని