మిత్ర.. మిత్రి.. అనే మేము..

‘హాయ్‌.. మేం మిత్ర.. మిత్రి.. మేమిద్దరం హ్యూమనాయిడ్‌ రోబోలం.. మీకు ఏ విధంగా సహాయపడగలం’ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదూ.. ఈ కథనం ఓ రెండు రోబోల గురించి అని.. మీరు ఊహించింది నిజమే! అసలే బయట కరోనా. అందులోనూ ప్రమాదకరంగా సెకండ్‌ వేవ్‌

Updated : 27 May 2021 06:41 IST

‘హాయ్‌.. మేం మిత్ర.. మిత్రి.. మేమిద్దరం హ్యూమనాయిడ్‌ రోబోలం.. మీకు ఏ విధంగా సహాయపడగలం’ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదూ.. ఈ కథనం ఓ రెండు రోబోల గురించి అని.. మీరు ఊహించింది నిజమే!
అసలే బయట కరోనా. అందులోనూ ప్రమాదకరంగా సెకండ్‌ వేవ్‌. అందుకే బెంగళూరులోని ఓ ఆసుపత్రి వారు వినూత్నంగా ఆలోచించారు. మిత్ర.. మిత్రి.. అనే రెండు రోబోల సేవలను అందుబాటులోకి తెచ్చారు. మిత్ర అనే రోబో.. ఆసుపత్రి లోపలికి వచ్చేవారి ఉష్ణోగ్రతలు పరీక్షించి నిబంధనల మేరకు ఉంటే ఆహ్వానం పలుకుతుంది. వారి ఫొటో తీసుకుంటుంది. వారి పేరు, వివరాలు, వారికున్న ఆరోగ్య సమస్య నమోదు చేసుకుంటుంది. కేవలం ఇంతటితోనే ఆగదు. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా అదే ఇచ్చేస్తుంది. దీని వల్ల రోగులకు పని సులువు అవుతుంది. గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. సిబ్బందికీ కరోనా ముప్పు ఉండదు.

మిత్రి.. ఓ మంచి నర్సమ్మ..
ఇక మిత్రి అనే రోబో విషయానికొస్తే.. ఒక రకంగా ఇది నర్స్‌ అన్నమాట. డాక్టర్‌కు సహాయకారిగా ఉంటుంది. ఇది ఆసుపత్రి మొత్తం తిరిగేస్తుంది. రోగులకు కావాల్సిన సమాచారం ఇస్తుంది. డాక్టర్‌ రౌండ్స్‌కు వెళ్లినప్పుడు ఆయనకు అసిస్టెంట్‌లా వ్యవహరిస్తుంది. అంతే కాదు. కరోనా రోగులు, వారి కుటుంబసభ్యులతో వాళ్లు తమ అనుభూతులు పంచుకునేలా.. ఒకరినొకరు పలకరించుకునేందుకు వీడియోకాన్ఫరెన్స్‌ పెట్టి సాయం చేస్తుంది.
కనిపించని ఆ మూడో రోబో..
మిత్రి.. మిత్ర.. రోబోలు సరే.. కనిపించని మూడో రోబో కూడా ఒకటి ఉంది తెలుసా. ఇది ఆసుపత్రి ఆవరణమంతా క్రిమిరహితం చేస్తుంది. ప్రమాదకర రసాయనాలు ఏమీ వాడకుండానే.. అతి నీలలోహిత (అల్ట్రావయొలెట్‌) కిరణాల సాయంతో కరోనా వైరస్‌లాంటి సూక్ష్మజీవుల పని పడుతుంది. మీకు మరో విషయం తెలుసా.. నోయిడాలోని ఓ ఆసుపత్రిలోనూ మిత్ర, మిత్రి రోబోల సేవలు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయంట. ‘ఇంతకీ ఈ రోబోలు ఏ విదేశాల నుంచి తెప్పించారబ్బా..? హా.. ఏముందిలే ఏ జపాన్‌వారో వీటిని తయారు చేసి ఉంటారులే’ అనుకుంటే ‘చిప్‌’లో కాలేసినట్లే! ఎందుకంటే వీటిని భారతీయులైన విశ్వనాథన్‌, ఆయన భార్య మహాలక్ష్మి రాధాకృష్ణన్‌ తయారు చేశారు. వీళ్లు 2016లో బోస్టన్‌ నుంచి బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. వీరిద్దరూ కలిసే ఈ రోబోలకు ప్రాణం పోశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని