Published : 30 May 2021 00:19 IST

‘ఓర్‌’నాయనో.. ఇదేం చేప!

హాయ్‌.. ఈ బొమ్మలో కనిపించేది బారెడు పొడవుంది. అయితే ఇది కచ్చితంగా పామే అనుకుంటున్నారేమో! అలా అయితే మీ కళ్లు మిమ్మల్ని మోసం చేసినట్టే. ఎందుకంటే అది ఓ పే..ద్ద చేప. అమ్మో ఇంత పెద్ద చేపలు కూడా ఉంటాయా.. అని అనుమానం వస్తోంది కదూ! నిజమే.. మరి ఎందుకు రాదూ.. కానీ ఇంత పెద్ద చేప ఎలా దొరికిందో కాస్త తెలుసుకుందామా!
తైవనీయుడైన ఓ జాలరి రోజూలాగే చేపల వేటకు వెళ్లాడు. ఓ రోజు యిలాన్‌ కౌంటీలోని డాంగ్‌ అవొ తీరంలో చేపలు పడుతుండగా అతనికి 5మీటర్ల పొడవున్న ఓ పేద్ద ‘ఓర్‌’ చేప చిక్కింది. దాని బరువు ఏకంగా 45 కిలోలు. అదే రోజున రెండుసార్లు భూకంపం వచ్చింది. అందుకే ఆ చేపను ‘ఎర్త్‌ క్వేక్‌ ఫిష్‌’ అని పిలుస్తుంటారు. దాన్ని ఓ రెస్టారెంట్‌ ఓనర్‌ 16 వేల న్యూ తైవాన్‌ డాలర్లకు కొన్నాడు. దీని కేజీ మాంసం ధర 400 న్యూ తైవాన్‌  డాలర్లుంటుందట. సాధారణంగా తెల్లవారు ఝామున లేదా సాయంకాలం చేపలు వలలో చిక్కుకుంటాయి. కానీ ఈ చేప అర్ధరాత్రి వేళ తన వలకు చిక్కిందట. 55 ఏళ్లుగా సీఫుడ్‌ రెస్టారెంట్ నడిపిస్తున్న చెన్‌ అనే వ్యక్తి ఇంత పెద్ద చేపను తానెన్నడూ చూడలేదని ఆశ్చర్యపోతున్నాడు. ఏటా ఓర్‌ రకం చేపలు దొరుకుతుంటాయి. కానీ అవి 100 నుంచి 200 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయంటున్నాడు చెన్‌. ఇది ఏకంగా 5 మీటర్లంటే.. అమ్మో! చాలా అరుదు అని, నిజంగా తన కళ్లను తాను నమ్మలేకపోయాడట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు