వారెవ్వా.. కి‘రాక్‌’ గార్డెన్‌!

నేస్తాలూ... ఓ తాతయ్య ఒక్కడే రాతి ఉద్యానవనాన్ని సృష్టించారు. మామూలుగా ఏదైనా ఉద్యానవనానికి వెళ్తే కాసేపటికి బోర్‌ ఫీలవుతాం. కానీ ఇక్కడకు వెళ్లారంటే మీకు సమయమే తెలియదు.

Published : 07 Jun 2021 01:42 IST

నేస్తాలూ... ఓ తాతయ్య ఒక్కడే రాతి ఉద్యానవనాన్ని సృష్టించారు. మామూలుగా ఏదైనా ఉద్యానవనానికి వెళ్తే కాసేపటికి బోర్‌ ఫీలవుతాం. కానీ ఇక్కడకు వెళ్లారంటే మీకు సమయమే తెలియదు. అడుగడుగునా జంతువులు, పక్షులు, మనుషుల విగ్రహాలతో కనువిందు చేస్తుంది. ఇంకా మీరెప్పుడూ చూడని వింతల్ని కూడా అక్కడ చూడొచ్చు. ఇదంతా తాతయ్య ఒక్కరే చేశారంటే ఆశ్యర్యంగా ఉంది కదూ! ఆ సంగతేంటో తెలుసుకుందాం రండి మరి.

చండీగఢ్‌లో సుఖ్‌నా సరస్సుకు దగ్గరలో ఉందీ రాతి ఉద్యానవనం. 1957లో నెక్‌ చంద్‌ సైని అనే తాతయ్య దీన్ని నిర్మించారు. అందుకే దీన్ని ‘నెక్‌ చంద్‌’ ఉద్యానవనమనీ పిలుస్తారు. భారతదేశంలోనే దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో నెమళ్లు, పులులు, సింహాలు, కుక్కపిల్లలు ఇలా ఒక్కటేమిటి అడవిని తలపించేలా జీవుల విగ్రహాలన్నీ ఇందులో ఉన్నాయి. రకరకాల వాయిద్యాల వ్యర్థాలతో మనుషుల బొమ్మలను తయారు చేశారు. అంతేనా దారి పొడుగునా జలపాతాలు, రాతిమేడలు, సెలయేర్లు, కొండలు, చిన్న చిన్న ఇరుకు దారులతో సహజసిద్ధంగా ఏర్పడినట్లుగా తయారు చేశారు.

ఇంతకీ ఎవరీ తాతయ్య
నెక్‌ చంద్‌ సైని అనే ఆయన చండీగఢ్‌లో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగంలో రోడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవాడు. ఉద్యోగ విధులు ముగిశాక అడవిలో తిరిగేవాడు. సాయంత్రం వేళల్లో, ఇంకా ఖాళీ సమయంలో చక్కటి ఆకృతి ఉన్న రాళ్లను ఏరుకుని తన సైకిల్‌ మీద మోసుకొచ్చేవాడు. వాటన్నింటితో తనకు వచ్చిన కళాఖండాలను రూపొందించేవాడు. అది ఆయనకు అలవాటుగా మారింది. మరింత ఉత్సాహంగా ఇటుకలు, రాళ్లు, విరిగిన గాజుముక్కలు, పగిలిన కుండలు, కాలిపోయి పనిచేయని బల్బులు ఇలా నిత్యం మనం వాడి పడేసిన వాటన్నింటిని పోగు చేశాడు. ఆ వ్యర్థాలన్నింటితో 20 వేల కళాఖండాలు రూపొందించాడు. దాదాపు 18 ఏళ్లు కష్టపడి రహస్యంగా ఇదంతా చేశాడు.

వెలుగులోకి ఎలా వచ్చింది?
తాతయ్యతో పాటు అక్కడే పనిచేస్తోన్న శర్మ అనే వ్యక్తి దాన్ని గుర్తించి, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అది అడవి కాబట్టి చంద్‌ కట్టినవన్నీ అక్రమమైనవనీ, వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ తాతయ్య ఒప్పుకోలేదు. ప్రజల అభిప్రాయాలు సేకరించారు. అదొక పర్యాటక ప్రదేశం అని వాళ్లతో అనిపించారు. అంతే ప్రభుత్వం కూడా కాదనలేకపోయింది. అతను రూపొందించిన కళాకృతులను ఒక చోటకు చేర్చి రాక్‌ గార్డెన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందరూ చంద్‌ తాతయ్య కట్టారు కాబట్టి దాన్ని ‘నెక్‌ చంద్‌ గార్డెన్‌’ అని పిలుస్తుంటారు. ఇంత సామ్రాజ్యాన్ని ఒక్కడే సృష్టించినందుకు ప్రభుత్వం చంద్‌ తాతయ్యను పద్మశ్రీతో సత్కరించింది. అదన్నమాట సంగతి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని