చిట్టి చేతులు చేసిన గట్టి మేలు!

చిట్టి చేతులు కదిలాయి.. చకచకా పలుగూ పారా పట్టాయి.. టకటకా మొక్కలు నాటేశాయి.. అవీ ఒకటో రెండో కాదు.. వందల్లోనే! ఇంకేం చిన్నపాటి అడవి తయారైంది అదీ.. కేవలం కొన్ని నిమిషాల్లోనే!

Published : 16 Jun 2021 01:40 IST

చిట్టి చేతులు కదిలాయి.. చకచకా పలుగూ పారా పట్టాయి.. టకటకా మొక్కలు నాటేశాయి.. అవీ ఒకటో రెండో కాదు.. వందల్లోనే! ఇంకేం చిన్నపాటి అడవి తయారైంది అదీ.. కేవలం కొన్ని నిమిషాల్లోనే!

పంజాబ్‌లోని లుధియానాలో ఓ పదిమంది పిల్లలు కలిసి గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. రాక్‌బాగ్‌ అనే ప్రాంతంలో 250 చదరపు అడుగులున్న ప్రదేశంలో ఏకంగా 750 మొక్కల్ని ఇటీవల కరోనా నిబంధనలు పాటిస్తూ నాటారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో కరోనా రోగులకు ఆక్సిజన్‌ ఏ స్థాయిలో అవసరమయ్యిందో మనం చూశాం. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేది వృక్షాలు మాత్రమే. అందుకే  ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వీళ్లు చెబుతున్నారు.

భవిష్యత్తు తరాల కోసం..
ప్రతిభా శర్మ, మాధవీ శర్మ, వైభవ్‌ కపూర్‌, ధ్రువ్‌ మెహరా, ఉదయ్‌ మెహరా, దివ్య బెహరా, లావణ్య సెహగల్‌, విరాన్ష్‌ బెహరా, నిత్య బస్సి అనే విద్యార్థులు 60 వేరు వేరు రకాల మొక్కల్ని ఇందుకోసం ఎంచుకున్నారు. వర్షాకాలం మొక్కలు నాటేందుకు అనువైన సమయమని.. మిగతా వారు కూడా ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. తాము ఇప్పుడు నాటిన మొక్కలు భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్‌ను అందించేందుకు ఉపయోగపడతాయి అని చెబుతున్నారు. ఇంత చిన్న వయసులోనే వీళ్లకు ఎంతో ముందుచూపు, సామాజిక, పర్యావరణ స్పృహ ఉందికదూ..! మరింకెందుకాలస్యం.. మనమూ పెద్దల సాయం తీసుకుని వీలైన చోట, వీలున్నన్ని మొక్కలు నాటేద్దామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని