భలే భలే కుక్క.. భౌ..భౌ.. అనని కుక్క!

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా.. ఏంటి అలా చూస్తున్నారు.. కాస్త ఎలుకలా.. ఇంకాస్త ముంగిసలా.. కొంచెం సీల్‌ మృగంలా..

Published : 17 Jun 2021 00:39 IST

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా.. ఏంటి అలా చూస్తున్నారు.. కాస్త ఎలుకలా.. ఇంకాస్త ముంగిసలా.. కొంచెం సీల్‌ మృగంలా.. ఇంకొంచెం బుజ్జి పాండాలా కనిపిస్తున్న నేనెవరు అనేగా ? అదే చెబుదాం అని వచ్చాను. మరి నా సంగతులేంటో తెలుసుకుంటారా!
నేనో విచిత్ర జీవిని. నన్ను మీరు నీటి కుక్క అని పిలుస్తారు కానీ.. నిజానికి నా పేరు ఆటర్‌. లూట్రా లూట్రా అనేది నా శాస్త్రీయ నామం. మీరు ఏ పేరుతో పిలిచినా నాకు ఓకే. ఎందుకంటే మనం మనం ఫ్రెండ్స్‌ కదా!

నేలైనా.. నీరైనా..
మాలో 13 రకాలున్నాయి. మేం నదులు, చెరువులు, సముద్రాల్లోనూ బతికేస్తుంటాం. మాలో కొన్ని రకాలు కేవలం నీటిలో మాత్రమే ఉండగలిగితే.. మరికొన్ని నీటిలోనూ, నేలమీదా.. రెండు చోట్లా ఉండగలవు.

చకచకా ఈదేస్తాం..
మేం మంచి ఈతగాళ్లం. వెల్లకిలా పడుకుని కూడా ఎంచక్కా మునిగిపోకుండా ఈతకొట్టగలం. సముద్ర నీటి కుక్కలైతే నీటి మీద తేలుతూ నిద్రపోతాయి. అప్పుడవి ఒకదాని చేతిని మరోటి పట్టుకుంటాయి. ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండటం కోసమే ఇలా చేస్తాయన్నమాట.

ఆహా.. మా ఆహారం!
ఇంతకీ మా ఆహారం ఏంటో చెప్పనే లేదు కదా..? ఇంకేంటి.. మేం ఎంచక్కా చేపల్ని తింటాం. కేవలం అవే కాదనుకోండి.. పీతలు, రొయ్యలు.. ఆఖరుకు ఆల్చిప్పల్ని, కప్పల్ని కూడా హాం.. ఫట్‌ చేసేస్తాం. ఆల్చిప్పల్ని పగలగొట్టుకుని తింటుంటే భలే తమాషాగా ఉంటుంది. రాళ్లతో, అవి దొరకనప్పుడు వాటిని మా పొట్టమీదే పగలగొట్టుకుంటాం. మీరెవరైనా చూస్తే మాత్రం... ‘అరె.. ఇవి భలే చప్పట్లు కొడుతున్నాయే’ అనుకుంటారు. అయినా మీరు మమ్మల్ని చూసే అవకాశం చాలా తక్కువ లెండి. మీ దగ్గర మేం పెద్దగా ఉండం కదా మరి. కృష్ణా నదిలో అక్కడక్కడ, అప్పుడప్పుడు కనిపిస్తుంటాం. మీకు మరో విషయం తెలుసా.. కొన్ని సార్లైతే చిన్న చిన్న మొసళ్లకూ ముచ్చెమటలు పట్టిస్తాం. కుదిరితే ఎంచక్కా కరకరలాడించేస్తాం.

గుంపులు గుంపులుగా ఉంటాం..
మేం ఒంటరిగా ఉండలేం. ఎప్పుడూ గుంపులుగా ఉంటాం. అదే మా బలం. మాకు చాలా పదునైన పళ్లుంటాయి. బలమైన కాళ్లు, తోక ఉంటుంది. కాళ్లు, పళ్లు వేటలో ఉపయోగపడితే.. ఈతలో తోక సాయం చేస్తుంది.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
మేం ఎప్పుడు చూసినా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపిస్తుంటాం. మాలో మేం భలే ఆడుకుంటాం. మేం 3 నుంచి నాలుగు అడుగుల వరకు పొడవు పెరుగుతాం. బరువేమో ఒక కిలో నుంచి మూడు కిలోల వరకు ఉంటాం. మాలో మగవి.. 10 నుంచి 15 సంవత్సరాల వరకు జీవిస్తే.. ఆడవి 15 నుంచి 20 సంవత్సరాల వరకూ జీవించగలవు. బంగ్లాదేశ్‌లో అయితే మమ్మల్ని మీ మనుషులు మచ్చిక చేసుకుని చేపల వేటకూ ఉపయోగించుకుంటారంట. నేస్తాలూ.. ప్రస్తుతానికి ఇవీ నా విశేషాలు. ఉంటా మరి. అసలే నాకు ఆకలి దంచేస్తోంది.. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని