వెలుగులు పంచే బల్ల!

హాయ్‌ నేస్తాలూ! మనకు రాత్రి పూట చదువుకోవడానికి లైట్లు ఉన్నాయి. ఒక వేళ కరెంటు పోయినా.. బ్యాటరీ లైటో, ఇన్వెర్టరో, జనరేటరో ఇలా ఏదో ఒకటి ఉంటుంది.

Updated : 19 Jun 2021 00:25 IST

హాయ్‌ నేస్తాలూ! మనకు రాత్రి పూట చదువుకోవడానికి లైట్లు ఉన్నాయి. ఒక వేళ కరెంటు పోయినా.. బ్యాటరీ లైటో, ఇన్వెర్టరో, జనరేటరో ఇలా ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మనకు పెద్దగా సమస్య ఉండదు. మరి మారుమూల పల్లెల్లో నేస్తాల పరిస్థితి ఏంటి? అదే ఆలోచించాడు ఓ అన్నయ్య. అందుకేం చేశాడు? తెలుసుకుందాం రండి..
శుతోష్‌ వశిష్ట.. వయసు 22. ప్రస్తుతం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, హర్యానాలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక మారుమూల పల్లెలో వాళ్ల అమ్మమ్మ, తాతయ్యలు ఉంటున్నారు. వాళ్లను చూడటానికి వెళ్లినప్పుడు గ్రామీణుల కరెంటు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాడు. ముఖ్యంగా పల్లె విద్యార్థుల అవస్థలు తనని కదిలించివేశాయి. కేవలం వాళ్ల తాతయ్య ఉండే ఇల్లే కాదు.. ఇలా భారతదేశ వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల 30 లక్షల ఇళ్లు ఇప్పటికీ విద్యుత్‌కు నోచుకోలేదని తెలిసి బాధపడ్డాడు. అంటే ఇంతమంది ఇళ్లల్లో నేస్తాలంతా చీకటయ్యాక చదువుకోవడానికి వీలవదు. కొవ్వొత్తి వెలుగునో, బ్యాటరీ లైట్‌నో ఆశ్రయించాల్సిందే. కానీ ఇది చాలా కష్టమైన పని కదా! 

2020లో ఆరంభం..
అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక త్రీడీ మోడల్‌ను ఈ అన్నయ్య గతేడాది జనవరిలో డిజైన్‌ చేశాడు. ఈ ఆలోచన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఏడాదిలో దానికి ఓ రూపం ఇచ్చాడు. తాను పర్యావరణానికి పెద్దగా హాని చేయని రీతిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. దాని ద్వారా కనీసం ఒకరైనా వెలుగులో చదువుకునేలా చేద్దామనుకున్నాడు. కానీ ఈ పని ప్రారంభించగానే దేశంలో కరోనా లాక్‌డౌన్‌ విధించారు. ఈ నమూనా తయారీకి కావాల్సిన వస్తువులు దొరకడం కష్టమైపోయింది.

స్నేహితుడి సాయంతో...
చివరికి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివే స్నేహితుడి సాయంతో వెలుగుల బల్లను రూపొందించాడు. ఇందులో ప్రధానంగా ఒక బ్యాటరీ, ఎల్‌ఈడీ బల్బులు ఉంటాయి. ఇవన్నీ బల్లకు అనుసంధానమై ఉంటాయి. బ్యాటరీ ఛార్జ్‌ కావడానికి పెడల్‌ ఉంటుంది. ఇది మన కాళ్ల దగ్గర ఉంటుంది. పెడల్‌ తొక్కడం ద్వారా యాంత్రికశక్తి విద్యుత్‌శక్తిగా మారి బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. బ్యాటరీ ద్వారా ఎల్‌ఈడీ బల్బులు వెలుగుతాయి. దీంతో ఒకరు చదువుకోవడానికి సరిపడా వెలుగులు వస్తాయి. అదన్నమాట సంగతి. ఎలాగైతేనేం ఈ అన్నయ్య ప్రయత్నం ఫలించింది. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అన్నట్టు ఈ అన్నయ్య ఆలోచన, ఆచరణ అదుర్స్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని