నేను పేలిపోతానోచ్‌!

హాయ్‌.. ఫెండ్స్‌! బాగున్నారా? ఏంటి నన్ను చూసి మీరు నేనెవరో కనిపెట్టేశారా...?

Published : 17 Jul 2021 00:37 IST

హాయ్‌.. ఫెండ్స్‌! బాగున్నారా?
ఏంటి నన్ను చూసి మీరు నేనెవరో కనిపెట్టేశారా...?
నన్ను ఆకాకరకాయ అనుకుంటున్నారు కదూ! ఊహూ.. కానే కాదు.. మీరు పప్పులో కాలేశారోచ్‌!
మరి నేనెవరంటే.. ఎవరంటే... ఆశ.. దోశ.. అప్పడం.. వడ.. ఇప్పుడే నేను ఎందుకు చెబుతాను.. ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది!!

గండి.. ఆగండి.. ఎందుకలా బుంగమూతి పెడతారు. ఎంతైనా మనం మనం ఫ్రెండ్స్‌ కదా.. ఇప్పుడే చెప్పేస్తా నేనెవరో. నేనో దోసకాయను. అయ్యో.. ఏంటి మొహాలు అలా కోపంగా పెడుతున్నారు. నేను నిజంగా నిజమే చెబుతున్నాను. నేను దోసకాయనే. కానీ కూర దోసనో, కీర దోసనో కాదు. నేను పేలే దోసను. అవును నేను ఉన్నట్లుండి తొడిమ నుంచి విడిపోయి విత్తనాలను వెదజల్లుతూ పేలిపోతాను. నేను కేవలం నాలుగు నుంచి అయిదు సెంటీమీటర్లు ఉంటానంతే. అంతకు మించి పెరగను.

నా అసలు పేరు ఏంటంటే..

అందరూ నన్ను పేలే దోస అని పిలుస్తారు కానీ.. నాకో పేరుంది తెలుసా.. అది ఏంటంటే ఎకబాలియం ఎలాటేరియం. పలకడానికి కాస్త కష్టంగా ఉంది కదూ! అందుకే మనకెందుకు ఇబ్బంది. ఎంచక్కా మీరూ అందరిలానే పేలే దోస అని పిలిచేయండి. నేను నిజానికి మధ్యధరా ప్రాంతానికి చెందిన మొక్కను. కానీ ఇప్పుడు ఆసియాలోనూ అక్కడక్కడ కనిపిస్తున్నాను. నేను విషపూరిత మొక్కనే అయినప్పటికీ నాలో కొన్ని కొన్ని ఔషధగుణాలు కూడా ఉన్నాయి. కీళ్లనొప్పులు, మూత్రపిండ, హృదయ సంబంధ సమస్యల చికిత్సలో నన్ను వాడతారంట.

ఎందుకు పేలతానంటే..

ఇంతకీ నేను ఎందుకు పేలతానంటే... నా లాంటి మరిన్ని మొక్కల్ని పుట్టించడం కోసం! అవును నేను పరిపక్వం చెందాక.. అదే ఫ్రెండ్స్‌.. నేను పండిపోయాక నాలో విత్తనాలు వృద్ధి చెందాయని తెలిశాక నేను ఉన్నట్లుండి పేలిపోతాను. తొడిమ నుంచి వాయువేగంతో విడిపోతాను. అప్పుడు నా నుంచి విత్తనాలు బుల్లెట్‌ కంటే వేగంగా బయటకు వస్తాయి. ఇలా దాదాపు అవి మూడు నుంచి ఆరు మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. అక్కడ వాటికి అనుకూల వాతావరణం ఏర్పడగానే ఆ విత్తనాల నుంచి కొత్తమొక్కలు వస్తాయి. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు