ఇది మామూలు వంతెన కాదు!

నేస్తాలూ... ఈ వంతెనను చూశారా! భలేగా ఉంది కదా! ఇది మామూలుది కాదు. ఇదొక 3డీ ప్రింటెడ్‌ స్టీల్‌ వంతెన! దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా!

Published : 26 Jul 2021 00:39 IST

నేస్తాలూ... ఈ వంతెనను చూశారా! భలేగా ఉంది కదా! ఇది మామూలుది కాదు. ఇదొక 3డీ ప్రింటెడ్‌ స్టీల్‌ వంతెన! దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా!

ది ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్‌ స్టీల్‌ వంతెన. నెదర్లాండ్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డాంలో ఉన్న పురాతన కాలువ మీద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ వంతెనను నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సంస్థ జులై 18న అందుబాటులోకి తీసుకు వచ్చింది. అన్నట్టు 4500 కిలోల బరువు, 12 మీటర్ల పొడవుండే ఈ వంతెనను 4 రోబోలు కలిసి తయారు చేశాయి. దీన్ని చేయడానికి 6 నెలలు పట్టిందట. ఆ తర్వాత పడవ సాయంతో తీసుకువచ్చి, క్రేన్‌తో ఈ కాలువ మీద ఉంచారు.

గట్టిగానే ఉంటుందా?!

ఆ సందేహమే అక్కర్లేదు. దీన్ని ఏర్పాటు చేసినప్పుడే అన్ని తనిఖీలు చేశారు. ఎంత బలంగా ఉంటుంది? ఎంత బరువును మోస్తుంది? ఉష్ణోగ్రతలు పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది? వంటివన్నీ పరీక్షించారు. అంతేకాదు ఈ వంతెనలో 12కు పైగానే సెన్సర్లున్నాయి. వాటి సాయంతోనే ఈ పరీక్షలన్నీ చేశారు. ఆ తర్వాతే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ వంతెన దెబ్బతిందనుకోండి. వెంటనే సెన్సర్లు అప్రమత్తం చేస్తాయి. బాగుంది కదా! ఇది విజయవంతం అవడంతో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇక మీదట పెద్ద పెద్ద భవనాలు కూడా రూపొందిద్దాం అనే ఆలోచనలో ఉందా సంస్థ. దాని మీద పరిశోధనలు కూడా చేస్తోంది. మొత్తానికి అదన్నమాట సంగతి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని