Published : 29 Jul 2021 02:08 IST

పెద్దపులి.. అనే నేను!

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

హాయ్‌.. ఫ్రెండ్స్‌... ఏంటి నన్ను చూసి అలా భయపడి పోతున్నారు. ఫర్లేదు.. మిమ్మల్ని ఏమీ అనను.. ఈ రోజు నా పుట్టిన రోజు.. అదే నేస్తాలు.. అంతర్జాతీయ పులుల దినోత్సవం. అందుకే మిమ్మల్ని సరదాగా పలకరించి, కొన్ని విశేషాలు చెప్పి పోదామని ఇలా వచ్చాను.

ఏటా జులై 29న గ్లోబల్‌ టైగర్‌ డేను జరుపుకొంటారు. దీన్నే అంతర్జాతీయ పులుల దినోత్సవం అంటున్నారు. అంతకు ముందు ఈ సంప్రదాయం లేదు. 2010లో రష్యా నుంచి ప్రారంభమైంది. రోజు రోజుకు తగ్గిపోతున్న మా సంతతిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్‌, నేపాల్‌, భారతదేశం, ఇంగ్లండ్‌, అమెరికా ప్రజలు అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజున నాకు మద్దతు తెలుపుతున్నారు.

ఆపదలో ఉన్నాం...

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3900 అటవీ పులులు మాత్రమే ఉన్నాయని వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ వాళ్లు తేల్చారు. మా చర్మం, గోర్ల కోసం వేటాడమే దీనికి ప్రధాన కారణం. కొన్ని ప్రాంతాల్లో మమ్మల్ని పెంచుకోవడం స్టేటస్‌గా భావిస్తున్నారు. బ్లాక్‌ మార్కెట్లో ఒక్కో పులి పిల్లకు కొన్ని వేల డాలర్ల ధర పలుకుతోంది. స్మగ్లర్లు మమ్మల్ని వేటాడడానికి ఇది కూడా ఓ కారణం.

మీ దేశానికి సలాం..

ప్రపంచవ్యాప్తంగా మా పులుల జనాభాలో 70 శాతం మీ భారతదేశంలోనే ఉంది. 2006 నుంచి క్రమంగా ఈ సంఖ్య పెరుగుతోంది. అప్పుడు 1,411 ఉంటే 2019 నాటికి ఈ సంఖ్య 2,967కు చేరుకుంది. అంటే ఓ రకంగా మా పులులు బతికి బట్టకడుతున్నాయంటే అది ఒక్క భారతదేశం వల్లే!

నేస్తాలూ..! సరే.. ఇక ఉంటామరి! ‘అప్పుడే వెళ్లిపోతున్నా.. అని బుంగమూతి పెడుతున్నారా?’ ఈ రోజు నా పుట్టిన రోజు కదా.. చాలా పనులున్నాయి నాకు. అయినా మీరు నాకు ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనేలేదు! చెప్పేయండి.. ఓ పనైపోతుంది. బై.. బై..!\

మీకు తెలుసా?

* పులులు చక్కగా ఈత కొట్టగలవు.

* పులి గాండ్రిస్తే ఆ శబ్దం మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది.

*  ఏ రెండు పులులకూ ఒకే రకమైన చారలు ఉండవు.

*  పులి పది సార్లు వేటకు ప్రయత్నిస్తే.. అందులో ఒక్కసారి మాత్రమే విజయవంతమవుతుంది.

*  ఎదిగిన పులి దాదాపు 360 కిలోల బరువు తూగుతుంది.

*  పులి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని