ఏనుగు ఏనుగు నల్లన దీనికీ ఉంది ఓ రోజన్న!
నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం
హాయ్.. నేస్తాలూ ఎలా ఉన్నారు... నన్ను చూడగానే మీకీపాటికి అర్థమై ఉంటుంది.. నేనో ఏనుగును అని.. నేనంటే మీకు భలే ఇష్టం కదూ! ముఖ్యంగా చాటంత చెవులు.. పెద్ద తొండం.. అంతెత్తున ఉండే ఆకారం... నేను నడిచి వస్తుంటే.. పెద్ద కొండకు ప్రాణం వచ్చినట్లే ఉంటుంది కదా! అయినా ఇప్పుడివన్నీ ఎందుకంటారా.. ఎందుకంటే.. ఈ రోజు మాకు ప్రత్యేకం కాబట్టి.. అదే నేస్తాలూ! ‘ప్రపంచ ఏనుగుల దినోత్సవం’. అందుకే మిమ్మల్ని ఇలా పలకరించిపోదామని వచ్చాను.
నేను పేరుకు పెద్ద జంతువునైనా.. నేను నా మనుగడ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. రోజు రోజుకూ క్షీణిస్తున్న అడవులు మాకు ముప్పులా మారుతున్నాయి. మీరు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే.. చూస్తుండగానే మేం అంతరించిపోయే జంతువుల జాబితాలో చేరే ప్రమాదమూ ఉంది! అందుకే మమ్మల్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో 2012 నుంచి ఆగస్టు 12న ఏటా ‘ప్రపంచ ఏనుగుల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు.
సినీ నిర్మాత చూపిన దారి
పాట్రిసియా సిమ్స్ అనే సినీ నిర్మాత, డైరెక్టర్ మొదటగా మమ్మల్ని పరిరక్షించాలని ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవానికి పిలుపునిచ్చారు. వేగంగా క్షీణిస్తున్న మా సంతతిని పరిరక్షించడమే దీని ప్రధాన ఆశయం. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి దీనికి అడుగులు పడ్డాయి. తర్వాత్తర్వాత సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ల రూపంలో వైరల్‌గా మారి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.
మా దంతాలే మాకు శత్రువులు!
గడిచిన పదేళ్లలో దాదాపు 25,000 నుంచి 50,000 వరకు ఆఫ్రికన్ ఏనుగులు చనిపోయాయి. ప్రస్తుతం కేవలం నాలుగు లక్షల ఆఫ్రికన్ ఏనుగులు మాత్రమే ఉన్నాయని అంచనా. ఇక ఆసియన్ ఏనుగులైతే కేవలం 40,000 మాత్రమే మిగిలి ఉన్నాయట. మా దంతాలకు బ్లాక్ మార్కెట్లో చాలా విలువ ఉంది. వాటి కోసమే చాలా వరకు స్మగ్లర్లు మమ్మల్ని హతమారుస్తున్నారు. నేస్తాలూ! ఇది చాలా బాధాకరం కదూ! అందుకే మమ్మల్ని పరిరక్షించాలనే సంకల్పంతోనే ఏటా ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సరే.. నేస్తాలూ.. ఉంటామరి.. బై.. బై!
మీకు తెలుసా!
* మేం 60 నుంచి 70 సంవత్సరాల వరకు జీవిస్తాం.
* రోజులో కనీసం 150 కిలోల వరకు ఆహారం తీసుకుంటాం.
* అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల కేవలం 20 నిమిషాల్లోనే లేచి నిల్చోగలుగుతుంది.
* చిన్నప్పుడు మీరు నోట్లో వేలు పెట్టుకున్నట్లే.. మా పిల్లలు కూడా నోట్లో తొండాన్ని పెట్టుకుంటాయి.
* ప్చ్...! మాకు అస్సలు గెంతడం రాదు.
* మాకు నీళ్లంటే భలే ఇష్టం. ఇంత భారీకాయంతో ఉన్నా.. మేం చక్కగా ఈదగలం తెలుసా!
* అద్దంలో మమ్మల్ని మేం గుర్తుపట్టుకుంటాం.
* మేం ఇంత పెద్దగా ఉంటాం కదా.. కానీ మాకు వేలెడంత కూడా ఉండని తేనెటీగలంటే మాత్రం చచ్చేంత భయం.
* మాకు మిరప ఘాటు కూడా పడదు.
* మేం గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Rohit Sharma: ఐపీఎల్లో రోహిత్‌కు విశ్రాంతి.. ముంబయి కోచ్ ఏమన్నాడంటే?
-
Movies News
Anushka Sharma: కాపీరైట్ ఆమెదే.. అనుష్క శర్మ పన్ను కట్టాల్సిందే..!
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా
-
Sports News
IPL 2023: ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? రోహిత్ సూపర్ ఆన్సర్
-
Politics News
Chandrababu: చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది: చంద్రబాబు