ఈ భూమి మనది!

మనకున్నది ఒకటే భూమి.. అది ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఆనందంగా ఉంటాం. పచ్చదనం, స్వచ్ఛదనం మీదే భూమి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటోంది ఓ అక్కయ్య. మరి ఇంకా ఏం చెప్పిందో తెలుసుకుందామా!

Published : 19 Aug 2021 01:13 IST

మనకున్నది ఒకటే భూమి.. అది ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఆనందంగా ఉంటాం. పచ్చదనం, స్వచ్ఛదనం మీదే భూమి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటోంది ఓ అక్కయ్య. మరి ఇంకా ఏం చెప్పిందో తెలుసుకుందామా!
తమిళనాడుకు చెందిన శ్రియా శృతి మిశ్రాకు 12 సంవత్సరాలు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇంత చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తించింది. ఈ అంశం మీద ఈ అక్కయ్య చేసిన వీడియో ‘యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో జరిగిన ‘హీలింగ్‌ ది ఎర్త్‌’ ప్రాజెక్టులో రెండో బహుమతి సాధించింది.

ఆదివాసీలను చూసి నేర్చుకుందామా..

‘పెద్దగా చదువుకోకున్నా... ప్రకృతి, పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలో ఆదివాసీలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. వాళ్లు ప్రకృతితో మమేకమై  జీవిస్తారు. పర్యావరణానికి ఎలాంటి నష్టమూ కలిగించరు’ అంటోంది శ్రియా. ఈ విషయాన్ని తాను గతంలో మేఘాలయలోని ఓ అడవిలో పర్యటించినప్పుడు గమనించానని చెబుతోంది. ప్రకృతిపై తన దృక్పథాన్ని ఆ పర్యటన మార్చిందంటోంది. ‘అక్కడి గిరిజనులకు అడవంటే చాలా ఇష్టం. వాళ్లు చెట్లకు ఏ మాత్రం నష్టం కలిగించకుండా జీవనం సాగిస్తారు. వారిని చూశాక నా దృక్పథం మారింది. తర్వాత ప్రకృతి పరిరక్షణ మీద చాలా ఆర్టికల్స్‌ చదివా’ అని చెబుతోంది. వీటన్నింటినే వీడియోగా తీసి పోటీకి పంపానంటోంది శ్రియా.

40 దేశాల నుంచి పోటీ..

ఈ పోటీకి 40 దేశాల నుంచి దాదాపు 400 వీడియోలు వచ్చాయి. వీటిలో మన శ్రియా తయారు చేసిన వీడియో రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఇటీవల జర్మనీలోని డ్రెస్డిన్‌ నగరంలో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఈ వీడియోను ప్రదర్శించారు కూడా. ఇంత చిన్న వయసులోనే ప్రకృతి, పర్యావరణ పరిక్షణ కోసం కృషి చేస్తున్న మన శ్రియా నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని