బుడుత రాసిన భారతం!

మహాభారతం చదివితే ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని పెద్దలు చెబుతుంటారు. కానీ దాన్ని చదవాలంటే మనవల్ల అవుతుందా! ఎంత పెద్ద గ్రంథమది. అదీకాక పదాలన్నీ పెద్దవాళ్లకి అర్థమయ్యేలా ఉంటాయి కదా! అయితే ఓ నేస్తం ఆ పుస్తకాన్ని మనకు అర్థమయ్యేలా మార్చేసింది. ఎలాగంటారా! పదండి తెలుసుకుందాం.

Published : 21 Aug 2021 01:45 IST

మహాభారతం చదివితే ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని పెద్దలు చెబుతుంటారు. కానీ దాన్ని చదవాలంటే మనవల్ల అవుతుందా! ఎంత పెద్ద గ్రంథమది. అదీకాక పదాలన్నీ పెద్దవాళ్లకి అర్థమయ్యేలా ఉంటాయి కదా! అయితే ఓ నేస్తం ఆ పుస్తకాన్ని మనకు అర్థమయ్యేలా మార్చేసింది. ఎలాగంటారా! పదండి తెలుసుకుందాం.

దిల్లీకి చెందిన సియా గుప్తా. వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. ‘పిట్టకొంచెం కూత ఘనం’ అన్నట్లు చిన్న వయసులోనే రచయిత్రి అయిపోయింది. కథలు, కవితా సంపుటాలు, పద్యాలు ఇలా అన్నీ రాసేస్తోంది. ప్రస్తుతం మహాభారతంలోని 1000 శ్లోకాలను రైమ్స్‌ రూపంలో రాసి, వార్తల్లోకెక్కింది. రైమ్స్‌తో పాటు అందులో నీతిని తెలియజేస్తూ ‘ది మహాభారత ఇన్‌ రైమ్‌’ అనే పేరుతో పుస్తకాన్ని రాసేసి అందరితో శెభాష్‌ అనిపించుకుంటోంది.  

రాయాలంటే చదవాలి..

సియా గుప్తాకి చిన్నప్పట్నుంచి రైమ్స్‌ అంటే భలే ఇష్టమట. పుస్తకాలు చదవడం మరీ ఇష్టమట. ఆ ఆసక్తితోనే ఎన్నో పుస్తకాలు చదివేసేది. ‘చదివితే రాయగలమని’ చాలామంది చెబుతారు కదా! అది నిజమే అంటోంది. తనకు ఎనిమిదేళ్ల వయసులో మొదటగా ‘ది మ్యాజికల్‌ వరల్డ్‌ ఆఫ్‌ పోయమ్స్‌’ అనే పుస్తకాన్ని రాసింది. అందరూ మెచ్చుకున్నారు. అదే ఉత్సాహంతో ప్రాచీన కథల ఆధారంగా ‘టేల్స్‌ ఇన్‌ రైమ్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఇవేకాకుండా ఇంకా చిన్న చిన్న కవితల పుస్తకాలూ రాసింది. నిజానికి ఇంత చిన్న వయసులో పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడమే గొప్ప. అలాంటిది చదివిన వాటిని అందరికీ అర్థమయ్యేలా రాయడం నిజంగా గ్రేట్‌ కదూ! అందుకే మన నేస్తాన్ని అభినందించేద్దాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు