మ్యావ్‌.. మ్యావ్‌.. పిల్లులే పిల్లులు!

పెంపుడు జంతువులంటే మనలాంటి చిన్నారులకు చాలా ఇష్టం కదూ! మన దగ్గర కుక్క తర్వాత పిల్లినే ఎక్కువగా పెంచుకుంటుంటారు. పిల్లి అనగానే మనకు ‘మ్యావ్‌.. మ్యావ్‌..’ అనే అరుపులే గుర్తుకు వస్తాయి.

Published : 22 Aug 2021 01:34 IST

సోదరి జ్ఞాపకార్థం

పెంపుడు జంతువులంటే మనలాంటి చిన్నారులకు చాలా ఇష్టం కదూ! మన దగ్గర కుక్క తర్వాత పిల్లినే ఎక్కువగా పెంచుకుంటుంటారు. పిల్లి అనగానే మనకు ‘మ్యావ్‌.. మ్యావ్‌..’ అనే అరుపులే గుర్తుకు వస్తాయి. అదే 200 పిల్లులు ఒక దగ్గర చేరితే ఇక మన చెవులకు చిల్లులే పడతాయి. కానీ ఓ చోట మాత్రం పిల్లులు చాలా బుద్ధిగా ఒద్దికగా ఉంటున్నాయి. ‘అవును.. ఇంతకీ అన్ని పిల్లులు అక్కడ ఎందుకున్నాయి? అయినా రక్షాబంధన్‌ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి కథనం ఇవ్వకుండా... ఈ పిల్లుల గోల ఏంటి?’ అనేగా మీ అనుమానం. ఇంకేం మరి.. ఇది చదివేయండి నేస్తాలూ!

గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీధామ్‌లో ఉపేంద్రా గోస్వామి అనే అంకుల్‌ పిల్లుల కోసం ఓ పార్క్‌నే ప్రారంభించాడు. అక్కడ దాదాపు 200 పిల్లులున్నాయి. ఉండటం అంటే ఏదో ఉండటం కాదు.. వాటికి అక్కడ సకల సౌకర్యాలున్నాయి. మెత్తటి సోఫాలు, ఆడుకోవడానికి ఆటవస్తువులు, బోర్‌ కొడితే చూడటానికి టీవీ. ఇంతకీ పిల్లులు ఆసక్తిగా ఏం చూస్తాయో తెలుసా.. డిస్కవరీ, నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానళ్లంట! వీటి ఆలనాపాలనా కోసం నెలకు దాదాపు రూ.50,000 వరకు ఖర్చవుతుందంట ఈ అంకుల్‌కు. మరి అవ్వదా ఏంటి..? ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే.

సోదరికి ప్రేమతో.. 

ఉపేంద్రా గోస్వామి అంకుల్‌ ఎందుకు ఇంత ఖర్చు చేసి మరీ పిల్లుల్ని పెంచుతున్నారో తెలుసా..! సోదరి జ్ఞాపకార్థం. అవును.. ఆ అంకుల్‌ సోదరి పేరు మీనా. ఆమె తన 18వ ఏట చనిపోయింది. ఆమెకు పిల్లులంటే చాలా ఇష్టం! అందుకే తన సోదరి జ్ఞాపకార్థం, గోస్వామి అంకుల్‌ పిల్లుల్ని 2015 నుంచి పెంచుతున్నాడు. క్రమంగా వాటి సంఖ్య పెరగడంతో 2017లో గాంధీధామ్‌లో ఓ ప్లాట్‌ తీసుకుని పిల్లుల కోసం పార్కులా తీర్చిదిద్దాడు. సోదరి అంటే ఎంత ఇష్టం లేకుంటే.. ఓ సోదరుడు ఇంతలా చేస్తాడు చెప్పండి. ఎంతైనా సోదరీసోదరుల అనుబంధం గొప్పది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని