Published : 24 Aug 2021 00:11 IST

ఇవి మన ఒలింపిక్స్‌!

ఒలింపిక్స్‌ ఎన్ని సంవత్సరాలకోసారి జరుగుతాయి..? అని ఎవరైనా మనల్ని అడిగితే.. వెంటనే మనం.. ‘కరోనా లాంటివి లేకుంటే.. నాలుగు సంవత్సరాలకోసారి’ అని చెబుతాం. కానీ ఏటా జరిగే ఒలింపిక్స్‌ కూడా ఉన్నాయి తెలుసా! అదీ ఎక్కడో విదేశాల్లో కాదు. మన దేశంలోనే..! అవును మీరు చదువుతోంది నిజమే! కాకపోతే ఇవి ‘గ్రామీణ ఒలింపిక్స్‌’.

ఖిలా రాయ్‌పుర్‌ స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌ ఏటా శీతాకాలంలో పంజాబ్‌లోని లూథియానా శివారున ఉన్న ఖిలారాయ్‌పుర్‌లో జరుగుతాయి. ‘గ్రామీణ ఒలింపిక్స్‌’ అని చెప్పి మళ్లీ ‘ఖిలా రాయ్‌పుర్‌ స్పోర్ట్స్‌’ అంటున్నారేంటని.. అనుకుంటున్నారు కదూ! వీటికే ‘రూరల్‌ ఒలింపిక్స్‌’ అని పేరు మరి. ఒలింపిక్స్‌కు లోగో ఉన్నట్లే.. వీటి నిర్వాహకులకూ ఓ లోగో కూడా ఉంది తెలుసా!

చాలా కాలం నుంచే..

ఈ క్రీడలు 1933 నుంచే ఏటా ఖిలారాయ్‌పుర్‌లో జరుగుతున్నాయి. ఇవి కేవలం నాలుగు రోజులు మాత్రమే జరుగుతాయి. ఇందులో పంజాబ్‌ గ్రామీణ క్రీడలుంటాయి. గుర్రపు స్వారీ, ఎండ్ల బండ్ల పోటీలు, బల ప్రదర్శనకు సంబంధించిన సంప్రదాయ పోటీలు నిర్వహిస్తుంటారు.

ఆధునిక క్రీడలు కూడా..

కేవలం సంప్రదాయ క్రీడలకే పరిమితం కాకుండా కొంతకాలంగా ఆధునిక క్రీడలకూ స్థానం కల్పించారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగుపందేలు, షాట్‌పుట్‌, హాకీ, కబడ్డీ, టగ్‌ ఆఫ్‌ వార్‌, ట్రాక్టర్‌ పందేలు..  వంటి అంశాల్లోనూ గ్రామీణ క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తానికి పోటీలు జరిగే ఆ నాలుగు రోజులు సందడే సందడి. అన్నట్లు ఈ క్రీడలు ఎందుకు ప్రారంభించారో తెలుసా.. పరిసర గ్రామాల ప్రజల మధ్య సత్సంబంధాల కోసమంట. మొత్తానికి ఇవీ నేస్తాలూ.. మన ఒలింపిక్స్‌ విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు