చిట్టి చేతుల్లో చక్కని పుస్తకాలు!

కరోనా వల్ల కొంతకాలంగా మనమంతా స్మార్ట్‌ఫోన్లకే అతుక్కుపోతున్నాం. ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి ఆన్‌లైన్‌ గేమ్‌ల వరకూ వీటికే అంకితమైపోతున్నాం. పుస్తకాలు చదివే అలవాటే తగ్గిపోతోంది....

Published : 25 Aug 2021 01:17 IST

కరోనా వల్ల కొంతకాలంగా మనమంతా స్మార్ట్‌ఫోన్లకే అతుక్కుపోతున్నాం. ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి ఆన్‌లైన్‌ గేమ్‌ల వరకూ వీటికే అంకితమైపోతున్నాం. పుస్తకాలు చదివే అలవాటే తగ్గిపోతోంది. చదవడం తగ్గితే సృజన కూడా తగ్గిపోతుంది. అందుకే ఓ ఇద్దరు అన్నయ్యలు మనలాంటి పిల్లల కోసం చిన్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రయత్నం చిన్నదే అయినా ఆశయం మాత్రం గొప్పది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

‘మడిషన్నాక కాసింత కళాపోసన ఉండాలి..’ ఇది పాత తెలుగు సినిమాలోని డైలాగ్‌.. ‘మనిషన్నాక కొన్నైనా పుస్తకాలు చదవాలి’ అని నాగాలాండ్‌కు చెందిన అకో ఫిరా, థెప్‌ఫకిలి ఫిరా సోదరులు అంటున్నారు. కేవలం అనడమే కాదు.. వారుండే ప్రాంతంలో ఓ చిన్న లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు.

ఇప్పుడిప్పుడే ఆదరణ

లైబ్రరీ అంటే కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు.. ఇలా సౌకర్యాలు ఏమీ ఉండవు. కేవలం పుస్తకాలుంటాయంతే! అవీ ఓ వందలోపు. దారి పక్కన ఓ చిన్న గోడమీద చిన్న డబ్బా.. దానిలో ఓ మూడు నాలుగు షెల్ఫులు. దానిలో కొన్ని పుస్తకాలు. అవి కూడా ఎక్కువగా పిల్లలకు సంబంధించినవే. దీనికి ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది.

ఆడుకోవడానికి వచ్చి..  

చుట్టు పక్కల ఆడుకోవడానికి వచ్చే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఈ చిన్న గ్రంథాలయంలోని పుస్తకాలను ఆసక్తిగా చదువుతున్నారు. చదవడం అయిపోయాక మళ్లీ అంతే జాగ్రత్తగా వాటిని యథాస్థానంలో పెట్టేసి వెళుతున్నారు. కేవలం పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా కథల పుస్తకాలు, నవలలు చదువుతున్నారు. మరికొందరు తమ దగ్గర ఉన్న పుస్తకాలను కూడా ఈ లైబ్రరీలో ఇతరులకు అందుబాటులో ఉంచమని ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఆలోచన భలేగా ఉంది కదూ! మనమూ మన ఇంట్లో ఓ చిన్న గ్రంథాలయం సిద్ధం చేసుకుందామా మరి. ఖాళీ దొరికితే స్మార్ట్‌ఫోన్లు, టీవీలతో కాలక్షేపం చేయకుండా కాసేపు మనకు నచ్చిన పుస్తకాన్ని హాయిగా చదువుకోవచ్చు.. ఏమంటారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని