నాన్న ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..!

ఆరేళ్లకే రేసింగ్‌ లైసెన్స్‌! పదమూడేళ్లకే 30 ట్రోఫీలు, పతకాలు కైవసం! ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసున్న బైక్‌ రేసర్‌గా గుర్తింపు. ఇవన్నీ రహీష్‌ ఖత్రి గురించే... ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయో తెలుసా?! 

Published : 29 Aug 2021 00:40 IST

ఆరేళ్లకే రేసింగ్‌ లైసెన్స్‌! పదమూడేళ్లకే 30 ట్రోఫీలు, పతకాలు కైవసం! ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసున్న బైక్‌ రేసర్‌గా గుర్తింపు. ఇవన్నీ రహీష్‌ ఖత్రి గురించే... ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయో తెలుసా?!

ముంబయికి చెందిన రహీష్‌ ఖత్రికి రేసింగ్‌ బైక్‌ దొరికిందంటే చాలు.. దాన్ని అమాంతం గాల్లో తేలేలా చేస్తాడు. ఎక్కడ పోటీలు జరిగినా పక్కాగా బహుమతి ఎగరేసుకుపోతాడు. అలా అని చదువును నిర్లక్ష్యం చేస్తాడా.. అంటే ఊహూ.. అసలు చేయనే చేయడు. ఒకవైపు బైక్‌ రేసింగ్‌లో దుమ్ము రేపుతూనే.. మరో వైపు చదువులపైనా దృష్టి పెడుతున్నాడు. దీనంతటికీ కారణం వీళ్ల నాన్న.

రయ్‌.. రయ్‌.. అంది బైకు..
రహీష్‌ ఖత్రి వాళ్ల నాన్న పేరు ముదస్సర్‌ ఖత్రి. ఆయన కూడా బైక్‌ రేసరే. కానీ ఆయనకు తగిన ప్రోత్సాహం లేక ఆ రంగంలో కొనసాగలేకపోయారు. ఈ పరిస్థితి తన కొడుక్కు రావొద్దు అనుకున్నాడు. తాను సాధించలేని లక్ష్యాలను తన కొడుకు సాధిస్తే చూడాలనుకున్నాడు. రహీష్‌ ఖత్రి కూడా అచ్చం నాన్న మనసెరిగిన పిల్లాడిలా బైక్‌ రేసింగ్‌లో దూసుకుపోతున్నాడు.

ఆరో ఏటే.. అరంగేట్రం..
మనలో చాలా మందికి ఆరేళ్లు ఉన్నప్పుడు సరిగా సైకిల్‌ కూడా తొక్కడం రాదు. కానీ రహీష్‌ కత్రి మాత్రం ఏకంగా రేస్‌ బైక్‌ను నడపడం నేర్చుకున్నాడు. చాలా కఠిన శిక్షణ తీసుకున్నాడు. ఎన్నో జాగ్రత్తలు, రక్షణ చర్యలు పాటించినప్పటికీ చాలాసార్లు గాయాలపాలయ్యాడు. అయినా వెనకడుగు వేయకుండా బహుమతుల మీద బహుమతులు గెలిచాడు. రికార్డుల మీద రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆలిండియా బైకింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన బుడతడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికీ ప్రతి వారం క్రమం తప్పకుండా బైక్‌ రేసింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. పోటీలు ఎక్కడ జరిగినా తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 30 పతకాలు, ట్రోఫీలు గెలిచాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరింకెందుకాలస్యం మనమూ రహీష్‌ కల నెరవేరాలని మనసారా కోరుకుందామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని