అందం అంటే నాదే మరి!

హాయ్‌.. నేస్తాలూ..! ఎలా ఉన్నారు. నేనైతే బాగున్నాను. ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా..? నేనో చేపను. అల్లాటప్పా చేపను మాత్రం కాదు.

Published : 01 Sep 2021 00:31 IST

హాయ్‌.. నేస్తాలూ..! ఎలా ఉన్నారు. నేనైతే బాగున్నాను. ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా..? నేనో చేపను. అల్లాటప్పా చేపను మాత్రం కాదు. అందమైన చేపను! ఇంకా చెప్పాలంటే చేపల్లోకెల్లా అందమైన చేపను. నా పేరు ఏంజెల్‌. మొన్నే మా బంధువొకరు విశాఖ సముద్ర తీరంలో మీ మనుషుల వలకు చిక్కారు. అప్పుడు వింతగా చెప్పుకొన్నారు. దాన్ని చూడటానికి చాలామంది వచ్చారు. అందరికీ మా గురించి తెలియదుగా. అందుకే చెబుదామని ఇదిగో ఇలా వచ్చా!

నిజానికి నా పేరు పోమాకాంటిడే... నేను అందంగా ఉంటాను కాబట్టి ఏంజెల్‌ ఫిష్‌ అని, మీ దగ్గర అయితే రాణి చేప అని పిలుస్తారు. మాలో మళ్లీ 86 రకాలున్నాయి. అవన్నీ అందమైనవే! కానీ చాలా మంది ఏంజెల్‌ ఫిష్‌ అంటే మంచినీటిలో పెరిగే ఏంజెల్‌ ఫిష్‌ అని పొరబడుతుంటారు. అవి వేరు.. మేము వేరు. మేం కేవలం సముద్రాల్లోనే, అది కూడా పగడపు దిబ్బల సమీపాల్లోనే బతికేస్తాం.

చిన్ని నోరు..
మాకు చిన్ని నోరు ఉంటుంది. మేం కేవలం 60 సెంటీమీటర్ల వరకు పొడవు పెరగగలం. మాలో కొన్ని రకాలైతే కేవలం 15 సెంటీమీటర్లే ఉంటాయి. ఇలాంటి రకాలను కొంతమంది అక్వేరియాల్లోనూ పెంచుకుంటూ ఉంటారు. మేం రంగు రంగుల్లో, చారలతో భలే అందంగా.. ముద్దుగా ఉంటాం. కానీ..

తింటే.. అంతే..
‘అబ్బ ఈ చేపలు ఎంత అందంగా ఉన్నాయో! రుచి కూడా భలేగా ఉంటుందిలే’ అని మీరు తినాలనుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. మా శరీరంలో ఒకరకమైన విషం ఉండటమే దానికి కారణం. మేం ఎక్కువ కాలం... అంటే దాదాపు 25 సంవత్సరాలకు పైగానే జీవించగలం. మా చుట్టుపక్కల పరిస్థితులకు అనుగుణంగా మమ్మల్ని మేం వేగంగా మార్చుకుంటాం. అంటే కాస్త అటూఇటూగా ఉన్నా.. సర్దుకుపోతాం అన్నమాట.

మాకు చాలా సిగ్గు..

మాకు అందంతోపాటు సిగ్గు కూడా ఎక్కువే. అందుకే మేం పగడపు దిబ్బల్లో దాక్కొని దాక్కొని బతికేస్తాం. అందుకే మీ వలలకు పెద్దగా చిక్కం. చాలా అరుదుగా మీకు మాత్రమే మీకు దొరుకుతుంటాం. మేం హిందూ మహాసముద్రం, పసిఫిక్‌, అట్లాంటిక్‌ మహాసముద్రాల్లో జీవిస్తాం. మొత్తానికి ఇవీ నా గురించి విశేషాలు. సరే ఇక ఉంటామరి ఫ్రెండ్స్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని