ఎంత పెద్ద పదమైనా భయం లేదు!

హాయ్‌.. నేస్తాలూ...! మనకు ఎంత బాగా ఇంగ్లిష్‌ వచ్చినా.. స్పెల్లింగ్‌లు అంటే కాస్తో కూస్తో భయం ఉంటుంది కదూ! కానీ ఓ ఆరేళ్ల చిన్నారి మాత్రం పెద్దవాళ్లు సైతం చెప్పలేని పెద్ద పెద్ద పదాలకూ

Published : 02 Sep 2021 00:10 IST

హాయ్‌.. నేస్తాలూ...! మనకు ఎంత బాగా ఇంగ్లిష్‌ వచ్చినా.. స్పెల్లింగ్‌లు అంటే కాస్తో కూస్తో భయం ఉంటుంది కదూ! కానీ ఓ ఆరేళ్ల చిన్నారి మాత్రం పెద్దవాళ్లు సైతం చెప్పలేని పెద్ద పెద్ద పదాలకూ చిటికెలో స్పెల్లింగ్‌లు చెబుతోంది. అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది. రికార్డులు కూడా సాధిస్తోంది. ఆ విశేషాలేంటో.. ఆ చిన్నారి ఎవరో తెలుసుకుందామా!

అనైషా కెరింగ్‌కు ఆరేళ్లు. ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణెలో ఉంటోంది. ఇంగ్లిష్‌లోనే 10 పెద్దవైన పదాలకు గడగడా స్పెల్లింగ్‌లు చెబుతోంది. pneumonoultramicroscopicsilicovolcanoconiosis
, Hippopotomonstrosesquippedaliophobia, supercalifragilisticexpialidocious ఇలాంటివి మొత్తం 10 పదాలకు కేవలం మూడు నిమిషాల్లోనే స్పెల్లింగ్‌లు చూడకుండానే చెప్పేస్తోంది.

అమ్మ చెప్పిందని..

మరి ఈ చిన్నారి ఇంత ఘనత ఎలా సాధించిందో తెలుసా.. తల్లి ప్రోత్సాహంతో! ఏదో సరదాగా వాళ్ల అమ్మ అనైషాతో ముందు చిన్న చిన్న పదాలకు స్పెల్లింగ్‌లు చెప్పించిందంట. మన అనైషా ఏమాత్రం తడుముకోకుండా అలవోకగా చెప్పేస్తుండటంతో క్రమంగా 10 అక్షరాలుండే పదాలు, 15, 20, 25, 30, 45 అక్షరాలు ఉండే పదాలు ఇలా పెంచుకుంటూ పోయిందంట. అవన్నీ ఈ చిన్నారి చాలా తేలిగ్గానే నేర్చుకుంది. టకటకా చెప్పేసింది. ఇంకేం ఏకంగా ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించేసింది.

అర్థాలు కూడా.. 

పెద్ద వాళ్లకే కష్టమైన స్పెల్లింగులు కూడా చెప్పగల మన అనైషా కేవలం అక్కడితో ఆగిపోలేదు. వాటిని పలకడం, అర్థాలు కూడా నేర్చుకుంది. తాను ఈ ఘనత సాధించినందుకు తన అమ్మానాన్న చాలా సంతోషిస్తున్నారు. తనకున్న అమోఘ జ్ఞాపకశక్తితో భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తానని గర్వంగా చెబుతోంది. సరే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో.. ఎవరికి తెలుసు? మీరే అనైషా రికార్డును బద్దలు కొట్టేస్తారేమో!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని