రంగు.. రంగుల వంతెన!

నేస్తాలూ..! ఇది ఏదో పాటలా ఉందే అని ఆలోచిస్తున్నారు కదూ. కాసేపు పాట సంగతి పక్కన పెడితే.. అసలు విషయం ఏంటంటే..

Updated : 04 Sep 2021 04:49 IST

రంగులే రంగులే..!
వంతెనకు రంగులే.. రంగులే..
ఆ దారిలో ఓ వింత వెలిసెలే..
అచ్చం లెగోలతో కట్టినట్టు
అచ్చుగుద్దినట్లు కుదిరెలే..
కొత్త కళ వచ్చెలే.. వచ్చెలే..
జనమూ మెచ్చెలే.. మెచ్చెలే..
రంగులే.. రంగులే..
వంతెనకు లెగో రంగులే!

నేస్తాలూ..! ఇది ఏదో పాటలా ఉందే అని ఆలోచిస్తున్నారు కదూ. కాసేపు పాట సంగతి పక్కన పెడితే.. అసలు విషయం ఏంటంటే.. వంతెనను అచ్చం లెగోలా తీర్చిదిద్దారు. ‘ఆ.. ఏముందిలే ఏదో రంగేసి ఉంటారులే. దానికే ఇంతలా  పొగడాలా?’ అని అనుకుంటున్నారేమో.. కానీ ఆ వంతెనను ఒక్కసారిగా చూస్తే నిజంగానే పెద్ద పెద్ద ప్లాస్టిక్‌ లెగోలతో దీన్ని కట్టారా అని భ్రమించేలా రంగులద్దారు. ఇంతకీ అ వంతెన ఎక్కడ ఉందో తెలుసా..? జర్మనీలో!

ఇద్దరు కూతుళ్ల కోసం..  

దక్షిణ జర్మనీలోని నార్త్‌ రైన్‌ వెస్ట్‌ఫాలియా ప్రాంతంలోని వుప్పెర్టాల్‌ శివారులో ఉంది ఈ వింత వంతెన. దీనికి మెగాక్స్‌ అనే ఓ స్ట్రీట్‌ ఆర్టిస్ట్‌ ప్రాణం పోశాడు. మెగాక్స్‌కు ఇద్దరు కూతుళ్లు. వాళ్లంటే తనకు చాలా ఇష్టం. వాళ్లకేమో లెగో బొమ్మలతో ఆడుకోవడం అంటే ఇష్టం. అందుకే ఈయన ఏకంగా లెగో గ్రూప్‌ వాళ్ల అనుమతి తీసుకుని 2,700 చదరపు అడుగులున్న ఈ వంతెనకు రెండు వారాలు కష్టపడి తన బృందంతో కలిసి రంగులేశాడు. అణువణువు జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దాడు. తర్వాత తన ఇద్దరు కూతుళ్లను సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇదంతా జరిగింది 2012లో అయినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. మొత్తానికి ఈ వంతెన చూడటానికి భలేగా ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని