Published : 13 Sep 2021 00:32 IST

భళా..! ఆర్యన్‌

ఏదైనా లెక్క అడిగితే మన చేతులు పెన్ను, పేపర్‌ మీదికి వెళ్లిపోతాయి. కాస్త పెద్ద లెక్కయితే ఇక కాలిక్యులేటర్‌తో కుస్తీనే! కానీ ఇవేమీ లేకుండా లెక్కల్లో చిక్కులు విప్పేస్తున్నాడు ఓ బుడతడు. ఎంత పెద్ద లెక్కయినా రెప్పపాటులో టక్కున చెప్పేస్తున్నాడు. తన ప్రతిభతో పతకాలు, ప్రశంసలు పొందుతున్నాడు. మరి ఆ నేస్తమెవరో తెలుసుకుందామా!

ర్యన్‌ శుక్లా. వయసు 11. ప్రస్తుతం నాసిక్‌లోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. అమ్మ మీనల్‌, నాన్న నితిన్‌.

అమ్మానాన్న ప్రోత్సాహంతో..

ఆర్యన్‌ చిన్నప్పట్నుంచి చురుకే. ఏ లెక్క అడిగినా వెంటనే చెప్పేవాడు. ఇది గమనించిన అమ్మానాన్న తన మెదడుకు మరింత సాన పెడుతూ వచ్చారు. లెక్కలు చెబుతూ, వాటిని విప్పే మెలకువలు తెలియజేస్తూ శిక్షణ ఇచ్చేవారు. గణిత ఒలింపియాడ్‌ పోటీల్లో రాణించేందుకు యుసెబియస్‌ నోరోన్య అనే గణిత నిష్ణాతుడి దగ్గర శిక్షణ కూడా ఇప్పించారు. అంతేకాదు మెదడు చురుగ్గా పనిచేసేందుకు ఎటువంటి ఆహారం అవసరమో అదే అందించేవారు. అలా అమ్మానాన్న ఆర్యన్‌ను మానసికంగా దృఢంగా ఉంచేవారు.

ప్రతిభతో పతకం..

యూకేలో ఆగస్టులో మూడు గంటలపాటు ఆన్‌లైన్‌ మైండ్‌ స్పోర్ట్స్‌ ఒలింపియాడ్‌ పోటీలు జరిగాయి. ఇందులో 120 మంది పాల్గొన్నారు. వాళ్లకు గణితంలో రకరకాల పోటీ పరీక్షలు పెట్టారు. చివరకు నలుగురిని ఫైనలిస్టులుగా ఎంపిక చేశారు. ఈ నలుగురిలో అతి చిన్నవాడు మన ఆర్యన్‌. ఆ తర్వాత నలుగురికి పేపర్‌, పెన్ను వాడకుండా లెక్కలు చేయమని పోటీ పెట్టారు. ఇందులో 8 అంకెల సంఖ్యలను 5 అంకెల సంఖ్యలతో విభజించడం, 7 అంకెలను, 7 అంకెల సంఖ్యలతో గుణించడం, భిన్నాలు, క్యూబ్‌ రూట్స్‌ ఇలా రకరకాలుగా పోటీలు నిర్వహించారు. వాళ్లందరితో పోటీపడి ఆర్యన్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని, జూనియర్‌ కేటగిరిలో బంగారు పతకాన్ని పొందాడు. అన్నట్టు ఈ పోటీలో ఒక ప్రశ్న 20 సెకన్ల వ్యవధిలో సమాధానం చెప్పాల్సి ఉండగా.. ఆర్యన్‌ కేవలం 5 సెకన్లలోనే చెప్పి అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు. ఇంత చిన్న వయసులో అంత ప్రతిభ కనబరచడం మాటలు కాదు కదా! అందుకే ఆర్యన్‌ను అభినందించేద్దాం రండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని