వయసు పదేళ్లే.. ప్రతిభలో భళారే!

డూడుల్‌ గీయాలంటే అందుకు ఎంతో నైపుణ్యం ఉండాలి. పెద్దవాళ్లకే కష్టమైన డూడుల్‌ని భలేగా గీసేస్తుంది ఓ నేస్తం. అంతేనా తన ప్రతిభతో రికార్డులూ సంపాదించేస్తుంది. ఆ వివరాలేంటో

Published : 15 Sep 2021 00:21 IST

డూడుల్‌ గీయాలంటే అందుకు ఎంతో నైపుణ్యం ఉండాలి. పెద్దవాళ్లకే కష్టమైన డూడుల్‌ని భలేగా గీసేస్తుంది ఓ నేస్తం. అంతేనా తన ప్రతిభతో రికార్డులూ సంపాదించేస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

ఆ నేస్తం పేరు తేజస్వి అభిలాష్‌. వయసు పదేళ్లు. ఉండేది కేరళలోని త్రిసూర్‌. తేజస్వికి చిన్నప్పట్నుంచీ బొమ్మలేయడమంటే మహా సరదా! ఆ ఆసక్తి వల్లనే ఈ రోజు అందరితో ప్రశంసలు అందుకుంటోంది. 59 సెకన్లలో డిజిటల్‌ డూడుల్‌ గీసి ఔరా అనిపించింది. ఆసియాలోనే ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించి, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డులను సొంతం చేసుకుంది.

మావయ్య శిక్షణలో..

తేజస్వికి మొదట్లో బొమ్మలు వేయడమే వచ్చు. డిజిటల్‌ ఆర్ట్‌ రాదు. కానీ వాళ్ల మావయ్య ఐప్యాడ్‌లో పెన్సిల్‌తో అసైన్‌మెంట్స్‌ గీయడం చూసి, తనకూ అది నేర్పమంది. తన ఇష్టాన్ని గమనించిన ఆయన ఐపెన్సిల్‌ ఉపయోగించి డిజిటల్‌ ఆర్ట్‌ నేర్పించారు. మొదట్లో పెన్సిల్‌ పట్టుకోవడం, గీయడం సరిగా వచ్చేది కాదు. కానీ పట్టుదలగా సాధన చేసి ఆర్ట్‌ పై పట్టు సాధించింది.

అమ్మ ప్రోత్సాహంతో..

తన పట్టుదల, నేర్చుకోవాలన్న తపన చూసిన తేజస్వి అమ్మ.. తనకి మరింత శిక్షణ ఇప్పించారు. ఏదైనా రికార్డు బ్రేక్‌ చేయమని చెబుతూ ప్రోత్సహించేవారు. అమ్మ మాటల్ని ఛాలెంజ్‌గా తీసుకుని డిజిటల్‌ డూడుల్‌ గీయడం సాధన చేసింది. అలా తన ప్రతిభతో రికార్డులను సాధించిందన్నమాట. మనలో సంకల్ప బలం ఉంటే ఎంతటి కష్టమైన పనైనా సులభంగా చేయగలం అని చెబుతుంటుంది మన నేస్తం. నిజమే కదా! మరి మన తేజస్విని మీరూ మనసారా అభినందించేయండి సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని