Published : 16 Sep 2021 01:19 IST

నోబెల్‌ కాని నోబెల్‌ ఇది!


ఏదైనా రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం నోబెల్‌ అని మనందరికీ తెలుసు కదా నేస్తాలూ! కానీ ‘ఇగ్‌ నోబెల్‌ ప్రైజ్‌’ అనేది కూడా ఉంది. అసలు నోబెల్‌కు దీనికి ఏంటి తేడా? అసలు ఈ ఇగ్‌ నోబెల్‌ ఎందుకు ఇస్తారు? ఎవరు ఇస్తారో తెలుసుకుందామా!

శాస్త్రవేత్తలు ఏళ్లకు ఏళ్లు కష్టపడి ప్రయోగాలు చేస్తారు. ఏదో విషయాన్ని కనిపెడతారు. ఏదో సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. ఇలాంటివి అరుదైనవి, అద్భుతమైనవి అయితే వాటికి నోబెల్‌ బహుమతి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అంత ప్రధానమైనవి, అంత ముఖ్యమైనవి కాని అంశాలు, ప్రయోగాలకు ఈ ఇగ్‌ నోబె

బహుమతులు ఇస్తుంటారు. అంటే ఓ రకంగా ఇవి వ్యంగ్యంగా ఉంటాయన్నమాట. కొన్ని నవ్వు తెప్పిస్తాయి. మరి కొన్ని కాస్త ఆలోచింపజేస్తాయి.

ఎప్పటి నుంచి అంటే...

ఈ ఇగ్‌ నోబెల్‌ బహుమతి ప్రదానోత్సవాలు 1991 నుంచి జరుగుతున్నాయి. వీటిని మార్క్‌ అబ్రహామ్స్‌ ప్రారంభించారు. ఈ అవార్డులను ఏటా హార్వర్డ్‌ యూనివర్సిటీలో శాండర్స్‌ థియేటర్‌లో ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

మొత్తం పది విభాగాలు

ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, వైద్యం, సాహిత్యం, శాంతి విభాగాలతో పాటు ప్రజారోగ్యం, ఇంజినీరింగ్‌, బయాలజీ ఇలా పది విభాగాల్లో ఇగ్‌ నోబెల్‌ బహుమతులుంటాయి. ‘ఇందులో వ్యంగ్యం, హాస్యం ఎక్కడుంది. అన్నీ చాలా సీరియస్‌ విభాగాలే కదా..!’ అనే అనుమానం మీకు రావొచ్చు. కానీ బహుమతులు గెలుచుకున్న అంశాలు తెలుసుకుంటే మాత్రం ‘మరీ ఇంత సిల్లీగా, ఫన్నీగా’ ఉంటాయా..?’ అనిపించక మానదు. గెలిచిన వారికి నగదు బహుమతి కూడా ఉంటుంది. అది ఏంటంటే.. చెల్లని 10 ట్రిలియన్‌ జింబాబ్వే డాలర్ల కరెన్సీ నోటు ఇస్తారు. ట్రోఫీగా ఏమిస్తారో తెలుసా.. పీడీఎఫ్‌ను ప్రింట్‌ తీసి ఇస్తారు. దాన్ని విజేతలే ట్రోఫీగా మార్చుకోవాల్సి ఉంటుంది.


అన్నీ ఇలాంటివే..

* పిల్లులు ఎన్ని రకాల అరుపులతో మనుషులతో కమ్యూనికేట్‌ అవుతాయి. మ్యావ్‌..మ్యావ్‌.. మియావ్‌.. మియావ్‌..  మ్యాయావ్‌.. మ్యాయావ్‌.. అరుపుల మధ్య తేడా ఏంటి? 

* సినిమా థియేటర్లలో ప్రేక్షకులు వదిలే గాలిలో ఉండే రసాయనాలకూ, సినిమాలో ప్రదర్శితమయ్యే హింస, హాస్యం, సంఘవిద్రోహ చర్యల సన్నివేశాలకు మధ్య ఏమైనా సంబంధం ఉంటుందా?

* పలు దేశాల్లో చూయింగ్‌ గమ్‌లో ఏ బ్యాక్టీరియా ఎంత పరిమాణంలో ఉంటుంది?

* ఒక దేశ రాజకీయ నాయకుల స్థూలకాయం, ఆ దేశ అవినీతికి సూచిక అవుతుందా?

* ముఖాలకు తగిలే దెబ్బల నుంచి తప్పించుకునేందుకే మనుషులకు గడ్డాలు వచ్చాయా?

* ఎదురెదురుగా నడిచే పాదచారులు ఎందుకు ఢీ కొట్టుకోరు.

* పాదచారులు కొన్నిసార్లు ఇతర పాదచారులను ఎందుకు ఢీ కొడతారు?

* జలాంతర్గాముల్లో బొద్దింకల నివారణ, నియంత్రణ.

* ఖడ్గమృగాన్ని తలకిందులుగా వేలాడదీసి గాల్లో రవాణా చేయడం సురక్షితమేనా? ఆ సమయంలో ఖడ్గమృగం శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి?
ఏంటి.. ఇవన్నీ చదివి.. ఏంటీ చెత్తంతా.. అనుకుంటున్నారు కదూ నేస్తాలూ! ఇవన్నీ 2021లో ఇగ్‌ నోబెల్‌ బహుమతులు గెలుచుకున్న ప్రయోగాలు, సిద్ధాంతాలు మరి! చూశారు కదా.. ఎంత ఫన్నీగా.. సిల్లీగా ఉన్నాయో... మొత్తానికి ఇవీ ఈ ఇగ్‌ నోబెల్‌ బహుమతి విశేషాలు. అన్నట్లు మీకో విషయం తెలుసా..
ignoble ’ అనే ఆంగ్లపదం స్ఫూర్తితోనే ఈ బహుమతికి ఇగ్‌ నోబెల్‌ అని పేరు పెట్టారట!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు