బుడుగు.. భలే పిడుగు!

ముచ్చటగా మూడేళ్లు.. అప్పుడప్పుడే వచ్చే ముద్దు ముద్దు మాటలు. ఆ పాపను చూస్తే.. పాపం.. ఏమీ తెలియని అమాయకురాలు అన్నట్టే ఉంటుంది....

Published : 17 Sep 2021 00:49 IST

ముచ్చటగా మూడేళ్లు.. అప్పుడప్పుడే వచ్చే ముద్దు ముద్దు మాటలు. ఆ పాపను చూస్తే.. పాపం.. ఏమీ తెలియని అమాయకురాలు అన్నట్టే ఉంటుంది. కానీ తన ప్రతిభతో అందరూ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. రికార్డులూ సొంతం చేసుకుంటూ ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆ చిన్నారి ఘనత ఏంటో తెలుసుకుందామా!

న పేరు జి.ఆర్‌.వామిక. ఉండేది కేరళలోని త్రిసూర్‌లో. ఈ చిన్నారికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా ఒక సారి చెప్పామంటే చాలు దాన్ని అలాగే గుర్తుపెట్టేసుకుంటుంది. తమ కూతురిలోని ప్రతిభను గుర్తించిన అమ్మానాన్న ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. చిన్నారికి మాటలు రావడంతోనే పండ్లు, కూరగాయలు, వాహనాలు, రంగులు ఇలా అన్నింటిని చూపించి వాటి పేర్లు చెబుతూ నేర్పించారు. వామిక కూడా ఎంచక్కా నేర్చుకుని ఎవరడిగినా టక్కున చెప్పేది.

మరింత రాటుదేలేలా..
అక్కడితో ఆగకుండా... స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖుల పేర్లనూ నేర్చేసుకుంది ఈ బుడత. వాళ్ల చిత్రాలను చూపించి ఎవరని అడిగితే వెంటనే వాళ్లెవరో చెప్పేస్తోంది. ఇంకేముంది తన జ్ఞాపకశక్తితో ఎంచక్కా ‘సూపర్‌ టాలెంటెడ్‌ కిడ్‌ 2021’గా అవార్డు అందుకుంది. దాంతో ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించేసింది. ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు బుడిబుడి అడుగుల వయసులోనే ఎంతో ఘనతను సాధించింది. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు, రికార్డులు తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుంటూ బుజ్జి వామికకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని