భళా బాల మేధావి..!

ఓ చిన్నారి.. అమ్మానాన్న ఏం నేర్పినా అట్టే గుర్తుంచుకుంటాడు. మళ్లీ అడిగితే టక్కున చెబుతాడు. నాలుగేళ్ల వయసులోనే తన ప్రతిభతో రికార్డులు సాధించేశాడు. ఇంతకీ ఎవరీ బుడత?

Updated : 19 Sep 2021 04:14 IST

ఓ చిన్నారి.. అమ్మానాన్న ఏం నేర్పినా అట్టే గుర్తుంచుకుంటాడు. మళ్లీ అడిగితే టక్కున చెబుతాడు. నాలుగేళ్ల వయసులోనే తన ప్రతిభతో రికార్డులు సాధించేశాడు. ఇంతకీ ఎవరీ బుడత?

కొమ్ము శ్రీమాన్‌ అకురత్‌. ప్రస్తుత వయసు అయిదేళ్లు. ఉండేది మేడ్చల్‌ జిల్లా చెంగిచెర్ల. అమ్మ సుప్రజ, నాన్న రాజీవ్‌కుమార్‌.

సాధనతో సాధ్యం..

అకురత్‌ని చూస్తే ఇంకా మాటలు రాలేదేమో అనుకుంటాం. కానీ కదిపి చూడండి. మనం నోరెళ్లబెట్టేలా బోలెడన్ని సంగతులు చెబుతాడు. ‘A’ నుంచి ‘Z’ వరకు చెప్పమని అడగండి. టక్కున చెప్పి, వాటిని రివర్స్‌లో కూడా అదే వేగంతో చెప్పేస్తాడు. వ్యతిరేక పదాలు అడిగితే ఓ 40 వరకు నిమిషంలో చెప్పేయగలడు. జాతీయ చిహ్నాలు, సౌరవ్యవస్థ గురించి ఆరా తీయండి. వాటికి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా చక్కగా తడుముకోకుండా చెబుతాడు. అలా చెప్పే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు.

తీసివేతల్లోనూ..

ఈ వయసు పిల్లలకు నంబర్లు నేర్పించడానికే తంటాలు పడతారు అమ్మానాన్న. అలాంటిది అకురత్‌ ఒక్క నిమిషంలో 20 తీసివేతలు లెక్కించి చెప్పేశాడు. దాంతో ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో పేరు నమోదు చేసుకున్నాడు. ఇవన్నీ నాలుగేళ్ల వయసప్పటికే సాధించేశాడు. ఇందుకు కారణం అమ్మానాన్న ప్రోత్సాహమే! అయినా అకురత్‌ కూడా చెప్పింది చెప్పినట్లు గుర్తుంచుకుని రికార్డులూ ప్రశంసలూ పొందుతున్నాడు. మరి అకురత్‌ గ్రేట్‌ కదా! మరింకేం పెద్దయ్యాక మరిన్ని రికార్డులు పొందాలని ఈ బాలమేధావికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని