ఈ బుడత.. సాధించింది ఘనత

ఎవరినైనా సాధారణ ప్రశ్నలడిగితే తమకు తోచింది చెబుతారు. అదే జనరల్‌ నాలెడ్జ్‌లో ఒక్క ప్రశ్న అడిగి చూడండి. ఒక్కోసారి పెద్దవాళ్ల సైతం అదీ అదీ అంటూ కంగారు పడతారు. కానీ ఈ చిన్నారి జనరల్‌ నాలెడ్జ్‌లో ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా ఎంచక్కా జవాబులు చెప్పేస్తుంది.

Updated : 25 Sep 2021 03:51 IST

ఎవరినైనా సాధారణ ప్రశ్నలడిగితే తమకు తోచింది చెబుతారు. అదే జనరల్‌ నాలెడ్జ్‌లో ఒక్క ప్రశ్న అడిగి చూడండి. ఒక్కోసారి పెద్దవాళ్ల సైతం అదీ అదీ అంటూ కంగారు పడతారు. కానీ ఈ చిన్నారి జనరల్‌ నాలెడ్జ్‌లో ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా ఎంచక్కా జవాబులు చెప్పేస్తుంది. దాంతో అవార్డులూ కొట్టేస్తుంది. తను చెప్పే సమాధానాలు చూసి అందరూ ఔరా అని నోరెళ్లబెడుతున్నారంటే నమ్మండి. ఇంతకీ ఎవరీ చిన్నారి. అసలెలా సాధ్యమిదీ? ఆ వివరాలు తెలుసుకుందాం రండి..

చిన్నారి పేరు కె.ఆస్నా షెహనాజ్‌. వయసు నాలుగేళ్లు. ఉండేది తమిళనాడులోని కాంచీపురం.

జ్ఞాపకశక్తి భళా!

షెహనాజ్‌ చిన్నప్పటినుంచి చురుకే. ఎవరేం చెప్పినా ఇట్టే గుర్తుంచుకుంటుంది. మళ్లీ తిరిగి వాళ్లు అడిగితే తడుముకోకుండా అప్పచెప్పేస్తుంది. అలా తన జ్ఞాపకశక్తితో అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. అంతేనా మనదేశానికి సంబంధించిన జనరల్‌ నాలెడ్జ్‌ బిట్స్‌ను అడిగితే చక్కగా చెప్పింది. కేవలం 30 సెకన్లలో 20 ప్రశ్నలకు జవాబులు చెప్పి, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

ఎలా సాధ్యం?

అంత చిన్న వయసులో మనదేశంలో జరిగే వాటి గురించి తనకెలా తెలుసు అని సందేహం రావొచ్చు. అదంతా అమ్మానాన్నల ప్రోత్సాహమే! చిన్నప్పట్నుంచే షెహనాజ్‌కి  ఏది చెప్పినా మళ్లీ అదేవిధంగా అప్పచెప్పడం గమనించారు అమ్మానాన్న. తనకు జ్ఞాపకశక్తి ఎక్కువ అని వాళ్లకి అర్థమైంది. అందుకే అప్పట్నుంచే తన ప్రతిభకు సానపెడుతూ వచ్చారు. ముందుగా పండ్లు, కూరగాయలు, వస్తువులు ఇలా ఒక్కొక్క విషయం చెప్పుకొంటూ వచ్చారు. అవన్నీ షెహనాజ్‌ గడగడా అప్పచెప్పేయడం వాళ్లని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక సంతోషంతో తమ కూతురి ప్రతిభ అందరికీ తెలియజేయాలి అనుకున్నారు. ఇక అప్పట్నుంచి జనరల్‌ నాలెడ్జ్‌లో ప్రశ్నలు చెప్పడం వాటిని మళ్లీ చెప్పమనడం చేశారు. మనదేశంలో జరిగే వింతలూ విశేషాల గురించి తరచూ చెబుతూ ఉండేవారు. రోజూ సమయం కేటాయించి తనతో సాధన చేయించారు. షెహనాజ్‌ కూడా చక్కగా నేర్చుకునేది. అలా తన ప్రతిభతో అవార్డునూ అందుకుంది. షెహనాజ్‌ ప్రతిభను చూసిన అందరూ ‘శభాష్‌ షెహనాజ్‌’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదీ సంగతి. మరి షెహనాజ్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని మనం కూడా మనసారా కోరుకుందామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని