మూడేళ్లకే మూడు రికార్డులు..

ఏంటి మూడేళ్లకి రికార్డులా? అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ.. ఈ బుడతడు తన ప్రతిభతో అందరినీ ఇలానే ఆశ్చర్యపరుస్తున్నాడు. తన జ్ఞాపకశక్తితో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. మరిన్ని సంగతుల కోసం చదివేయండి.

Published : 27 Sep 2021 02:24 IST

ఏంటి మూడేళ్లకి రికార్డులా? అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ.. ఈ బుడతడు తన ప్రతిభతో అందరినీ ఇలానే ఆశ్చర్యపరుస్తున్నాడు. తన జ్ఞాపకశక్తితో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. మరిన్ని సంగతుల కోసం చదివేయండి.

హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారి పేరు గౌజి షణ్ముఖ సుదర్శన్‌. ప్రస్తుత వయసు నాలుగేళ్లు. అమ్మ పావని, నాన్న పవన్‌. 

షణ్ముఖకి చిన్నప్పట్నుంచి జ్ఞాపకశక్తి ఎక్కువ. అందుకే ఏదైనా ఒక విషయం ఒక్కసారి చెబితే చాలు అట్టే గుర్తుపెట్టుకుని చెబుతాడు. అది గమనించిన అమ్మానాన్న తన ప్రతిభకు సాన పెట్టారు. ఇంకేముంది షణ్ముఖ కూడా వాళ్ల శిక్షణలో ఆరితేరిపోయాడు. తెలుసా! ప్రపంచ పటంలో ఏ దేశం ఎక్కడుందని అడిగితే పెద్దవాళ్లు కూడా పేరు చూసుకుని గానీ చెప్పలేరు కదా!  అదే షణ్ముఖని అడిగి చూడండి. ఎంచక్కా ఆ దేశాన్ని చూపించి దాని రాజధాని ఏదో కూడా చెప్పేస్తాడు.

మాటలే కాదు పాటలు కూడా!

మూడేళ్ల వయసులోనే 195 దేశాల జాతీయ జెండాలను గుర్తించిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. దాంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (లండన్‌), గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఇలా వరసగా మూడు రికార్డుల్లో తన పేరును ఎక్కించేసుకున్నాడు. అన్నట్టు షణ్ముఖకి మ్యూజిక్‌ అంటే కూడా ఇష్టమట. అంతేనా పాటలు కూడా చక్కగా పాడతాడట. తన ముద్దు ముద్దు మాటలతో అలా పాడుతుంటే చూసేవాళ్లు ఒకింత ఆశ్చర్యపోయి చూడాల్సిందే! ఏదేమైనా షణ్ముఖ ప్రతిభను చూశాక ఎవరైనా ‘శభాష్‌ షణ్ముఖ’ అని అనకుండా ఉండలేరు కదా! మరి మీరూ షణ్ముఖని అభినందించేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని