Published : 29 Sep 2021 01:14 IST

అమ్మకోసం అమల్‌!

జనం అంతా గుమిగూడారు.. చేతుల్లో లాంతర్లు పట్టుకున్నారు. చిన్నారులు కేరింతలు కొడుతున్నారు... అక్కడి వాతావరణం అంతా జాతరను తలపిస్తోంది... వాళ్లంతా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు.. ఒక్కసారిగా అందరి మోముల్లో మెరుపు.. కారణం అమల్‌ వచ్చేసింది.. వచ్చేస్తోంది! ఇంతకీ అమల్‌ ఎవరంటే...!

పే..ద్ద బొమ్మే అమల్‌. సిరియాకు చెందిన ఓ శరణార్థ బాలికకు ప్రతిరూపమే ఈ బొమ్మ. అమల్‌ అంటే ఆశ అని అర్థం. సిరియా - టర్కీ సరిహద్దులకు సమీపంలోని గజియాంటెప్‌ నుంచి ఈ బొమ్మ నడక ప్రారంభమైంది. ‘బొమ్మ నడవడం ఏంటి? లోపల ఏమైనా యంత్రాలున్నాయా? పోనీ బ్యాటరీలు ఏమైనా అమర్చారా?’ అనే అనుమానం మీకు రావొచ్చు. కానీ అవేమీ కాదు.. మనుషుల సాయంతోనే ఈ బొమ్మ నడుస్తుంది. ‘ఓస్‌.. అంతేనా!’ అని తేలికగా తీసిపారేయకండి. ఇది దాదాపు ఎనిమిదివేల కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది మరి.

ఎనిమిది దేశాల మీదుగా..

గజియాటెంప్‌లో జులైలో లాంతర్ల వెలుగుల్లో, అశేష ప్రజానీకం నడుమ ప్రారంభమైన దీని ప్రయాణం ఎనిమిది దేశాల మీదుగా సాగనుంది. నవంబర్‌లో యూకే చేరుకోవడంతో ఈ యాత్ర పూర్తి కానుంది. ఈ బొమ్మ ఎత్తు 12 అడుగులు. 2006లో రాయల్‌ డీలక్స్‌ కంపెనీ తయారు చేసిన ‘ది సుల్తాన్స్‌ ఎలిఫెంట్‌’ (కదిలే ఏనుగు బొమ్మ) స్ఫూర్తితో ఈ అమల్‌ రూపొందింది. చాలామంది కళాకారులు కష్టపడి ఈ బొమ్మకు రూపం ఇచ్చారు. ప్రముఖ బొమ్మల తయారీ సంస్థ హ్యాండ్‌ స్ప్రింగ్‌ పప్పెట్‌ కంపెనీతో కలిసి యూకే కేంద్రంగా పనిచేసే గుడ్‌ఛాన్స్‌ థియేటర్‌ వాళ్లు దీన్ని తయారు చేశారు. ఎండావానలకు తట్టుకుని ఎక్కువ కాలం నిలిచి ఉండేలా కార్బన్‌ ఫైబర్‌ పదార్థాలను ఇందుకోసం వాడారు.

వెతుకుతూ.. వెతుకుతూ..

అమల్‌ అనే శరణార్థ చిన్నారి తనకు ఆహారం తేవడానికి వెళ్లి ఇంకా రాని తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ నేపథ్యంతోనే అమల్‌ బొమ్మ తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. శరణార్థుల కష్టాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగానే ఈ ప్రయత్నం అన్నమాట. కరోనా లాక్‌డౌన్‌ల వల్ల ఈ యాత్రకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా చోట్ల దేశాల సరిహద్దులు మూసివేసి ఉండటం, క్వారంటైన్‌ నిబంధనలే దీనికి కారణం. మొత్తానికి ఇదీ ఈ పే..ద్ద బొమ్మ వెనక ఉన్న సంకల్పం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని