పిట్ట కొంచెం.. కోడింగ్‌ ఘనం!

ఓ పిల్లాడు. మాస్టారిగా మారిపోయాడు. అలాగని బడిలో పాఠాలు అనుకునేరు. పెద్దవాళ్లే కష్టం అనుకునే కోడింగ్‌ను ఈ బుడతడు చెబుతున్నాడు. అది కూడా తన సొంత అకాడమీలోనే!

Published : 30 Sep 2021 01:23 IST

ఓ పిల్లాడు. మాస్టారిగా మారిపోయాడు. అలాగని బడిలో పాఠాలు అనుకునేరు. పెద్దవాళ్లే కష్టం అనుకునే కోడింగ్‌ను ఈ బుడతడు చెబుతున్నాడు. అది కూడా తన సొంత అకాడమీలోనే! అదెలా? అంటారా! తన మాటల్లోనే తెలుసుకుందామా!  

హాయ్‌ నా పేరు మహమ్మద్‌ అమీన్‌. మాది కేరళ. మా అమ్మ పేరు రెబీనా, నాన్న పేరు షైహబుద్దీన్‌. నాకు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు.

సరదాగా నేర్చుకున్నా..

మా అమ్మానాన్న సొంతంగా స్కూల్‌ నడిపేవారు. నేను అందులోనే చదువుకుంటున్నా. అయితే మా స్కూల్లో పాఠాల్లో భాగంగా కోడింగ్‌ కూడా నేర్పిస్తారు. అలా నేను ఎనిమిదేళ్ల వయసప్పుడు కోడింగ్‌ క్లాస్‌ విన్నాను. అది నాకెంతో నచ్చింది. దాంతో అప్పట్నుంచి స్కూల్‌లో చెప్పేదే కాకుండా నెట్‌లో సెర్చ్‌ చేసి అడ్వాన్స్‌ కోడింగ్‌ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా రెండేళ్లు అందులో మెలకువలు తెలుసుకున్నాక నాకు నేనుగా కోడింగ్‌ రాయగలిగాను. ఈ విషయం నాన్నకు చెబితే ఆయనెంతో సంతోషించారు.

సొంత అకాడమీ పెట్టాను..

నా ఆసక్తి తెలుసుకున్నాక నాన్న కూడా కోడింగ్‌లో తనకు తెలిసిన విషయాలు కూడా చెబుతుండేవారు. అప్పుడు నాన్నతో ఒక ఇన్‌స్టిట్యూట్‌ పెట్టి నేనే పాఠాలు చెబుతా అన్నాను. నాన్నకు ఆశ్చర్యం వేసింది. కానీ నాకు అడ్డు చెప్పలేదు. అలా నాన్న సాయంతో పదేళ్ల వయసులో ‘ఏబీసీ’ కోడింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించాను. ఇందులో గూగుల్‌ మీట్‌ ద్వారా కోడింగ్‌ నేర్చుకునే వెసులుబాటు కల్పించాను.

ప్రపంచ దేశాల నుంచి..

నేను ఈ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టగానే చాలామంది నా స్నేహితులు నేర్చుకోవడానికి ఆసక్తి చూపారు. అలా అలా చాలామందికి తెలిసింది. తర్వాత ఇంకొంతమంది ట్యూటర్లను సంప్రదించి ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పమని అడిగాను. ప్రస్తుతం ప్రపంచ దేశాలనుంచి నా ఇన్‌స్టిట్యూట్‌లో ట్యూటర్లు కోడింగ్‌ పాఠాలు చెబుతున్నారు. అదేవిధంగా 6 నుంచి 20 ఏళ్లలోపు విద్యార్థులు ఇందులో కోడింగ్‌ నేర్చుకుంటున్నారు. నేను మొదలు పెట్టిన చిన్న అకాడమీ ఈ రోజు ప్రపంచదేశాలకు విస్తరించడం చాలా సంతోషంగా ఉంది. కోడింగ్‌ నేర్చుకోవడం ద్వారా సృజనాత్మకత పెరుగుతుంది. మనలో ఆలోచించే విధానం కూడా మారుతుంది. ఇష్టంగా నేర్చుకుంటే ఏదీ కష్టమనిపించదని మీకు చెబుదామని ఇలా వచ్చేశాను. మరి ఉంటాను. బై..బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని