తమన్నా వినూత్న సృజన

మనల్ని బొమ్మలేయమంటే మొదట గుర్తొచ్చేది గణేశుడే కదా! అనుకున్నదే తడవు పెన్సిల్‌ పట్టుకుని ఎంచక్కా వినాయకుడి ఆకారం చూసి బొమ్మ వేసేస్తాం. అయితే మామూలుగా వేస్తే నా ప్రత్యేకతేముంది అనుకుంది కాబోలు ఈ చిన్నారి.

Published : 02 Oct 2021 00:27 IST

మనల్ని బొమ్మలేయమంటే మొదట గుర్తొచ్చేది గణేశుడే కదా! అనుకున్నదే తడవు పెన్సిల్‌ పట్టుకుని ఎంచక్కా వినాయకుడి ఆకారం చూసి బొమ్మ వేసేస్తాం. అయితే మామూలుగా వేస్తే నా ప్రత్యేకతేముంది అనుకుంది కాబోలు ఈ చిన్నారి. అక్షరాలు, అంకెలను ఉపయోగిస్తూ రకరకాల భంగిమల్లో వినాయడి బొమ్మలు గీసేసింది. తన వినూత్న ప్రతిభతో రికార్డులూ అందిపుచ్చుకుంటుంది. మరిన్ని సంగతులు.. మీకోసం..

మిళనాడుకు చెందిన ఆ చిన్నారి పేరు తమన్నా కె.జైన్‌. వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం చెన్నైలో ఏడో తరగతి చదువుతోంది.

ప్రత్యేక గుర్తింపుకోసం..

తమన్నా చిన్నప్పటినుంచి చురుకే. అయితే తను ఏం చేసినా అందులో ప్రత్యేకత కోరుకుంటుంది. ఆ ఆసక్తితోనే డ్రాయింగ్‌ వేసేది. వేసే బొమ్మల్లో కూడా వైవిధ్యం ఉండాలనుకునేది. అందుకే ఏ బొమ్మ వేసినా దాన్ని రకరకాల భంగిమల్లో వేసి, అందరిచేత  ప్రశంసలు పొందుతోంది.

సాధనతో సాధ్యం

తమన్నా వేసే బొమ్మలు చూసి అమ్మానాన్న ఆశ్చర్యపోయేవారు. తన ప్రతిభను సానబెట్టేందుకు డ్రాయింగ్‌లో శిక్షణనిప్పించారు. అలా చక్కగా సాధనతో ఎన్నో బొమ్మలు వేసి, బహుమతులూ అందుకుంది. అలా డ్రాయింగ్‌లో ఆరితేరింది. ఆ తర్వాత తమన్నాకు ఒక ఆలోచన వచ్చింది. ‘ఎన్నో బొమ్మలు వేస్తున్నా కదా! వినాయకుడి బొమ్మనే వివిధ రకాలుగా వేస్తే ఎలా ఉంటుందని’ అనుకున్నదే తడవుగా పెన్సిల్‌తో చకచకా బొమ్మలు గీయబోయింది. అయితే అలా ఒట్టిగా గీస్తే అందులో ప్రత్యేకత ఉండదు కదా అనుకుంది. అప్పుడే తనకు మరో వినూత్న ఆలోచన వచ్చింది. గణేశుడి బొమ్మను అంకెలతో, అక్షరాలతో వేయాలనుకుంది. కానీ మొదట్లో కొంచం కష్టమనిపించింది. తర్వాత్తర్వాత సాధన చేసింది. అలా 26 ఆంగ్ల అక్షరాలతో, 0 నుంచి 9 వరకు అంకెలను ఉపయోగించి, 36 వినాయకుడి ప్రతిరూపాలను వివిధ భంగిమల్లో గీసింది. అది కూడా కేవలం 29 నిమిషాల 55సెకన్లలోనే సాధించింది. అన్ని బొమ్మలు పైగా అక్షరాలతో, అంకెలతో అంత తక్కువ సమయంలో వేయడం సాధ్యం కాని పని. అలాంటిది తమన్నా తన సాధనతో సాధించింది. అంతేనా తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. నిజంగా గ్రేట్‌ కదా తమన్నా. దీన్ని బట్టి మనకొకటి అర్థమవుతుంది. ఎవరి టాలెంట్‌ ఏంటో మనం ప్రయత్నిస్తేగానీ తెలియదు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేయాలన్నమాట!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని