నాలుగేళ్ల సవ్యసాచి..!

ఓ నాలుగేళ్ల బుడత అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. తన ప్రతిభతో రికార్డులు బద్దలు కొడుతోంది. చిన్నవయసులో తన అసాధారణ కళతో అద్భుతాలు చేస్తోంది.

Published : 04 Oct 2021 00:35 IST

ఓ నాలుగేళ్ల బుడత అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. తన ప్రతిభతో రికార్డులు బద్దలు కొడుతోంది. చిన్నవయసులో తన అసాధారణ కళతో అద్భుతాలు చేస్తోంది. ఇంతకీ ఎవరా బుడత.. ఏమా ఘనత..? తెలుసుకుందాం రండి.

ధ్యప్రదేశ్‌కు చెందిన ఫయిజా మన్సూరి వయసు నాలుగేళ్లు. కానీ ఈ వయసులోనే తన గురించి అందరూ గొప్పగా చెప్పుకునేలా పేరు సంపాదించేసింది.

సాధనతోనే సాధించింది..

సాధారణంగా నాలుగేళ్ల వయసులో అక్షరాలు, అంకెలు అప్పుడప్పుడే రాయడం నేర్చుకుంటారు. పెన్ను కూడా సరిగా పట్టుకోవడం రాక, ఒక చేత్తోనే స్పీడ్‌గా రాయలేరు. అలాంటిది ఒక చేత్తో కాదు రెండు చేతులతో ఒకేసారి రాస్తూ సవ్యసాచి అనిపించుకుంటోంది. అయితే ఒకేసారి రెండు చేతులతో రాయడం పెద్దవాళ్లకు కూడా కుదరని పని. కానీ ఈ చిన్నారి ఆ ఘనతను సాధించి అమ్మానాన్నలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక అంతే! తనతో మరింత సాధన చేయించారు.

ఏకకాలంలో రాసేసింది..

అంకెలను రాసేటప్పుడు సమయం పెట్టుకుని రాసేలా శిక్షణనిచ్చారు. అలానే ఫయిజా కూడా నేర్చుకుని, ఈ మధ్యనే 1 నుంచి 100 అంకెలను రెండు చేతులతో ఏకకాలంలో 11 నిమిషాల 41 సెకన్లలో రాసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకుంది. ఇక అప్పట్నుంచి ఫయిజా, బుజ్జి సెలెబ్రిటీ అయిపోయింది. అందరూ సవ్యసాచి అంటూ ఫయిజాను ముద్దు చేస్తున్నారు. చిన్న వయసులోనే ఇంత ఘనత సాధించడం నిజంగా గ్రేట్‌ కదూ! మరింకేం తను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామా! పనిలో పనిగా.. మీరూ ఓసారి ఇలా రాసేందుకు ప్రయత్నించి చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని