నాన్న కల.. కలరిపయట్టుతో నెరవేర్చింది!

కలరిపయట్టులో ప్రతిభ చూపుతోంది ఓ చిన్నారి. తన కళతో ఎందరో ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తనెవరు? ఈ కలరిపయట్టు కథేంటి? తెలుసుకుందామా!

Published : 13 Oct 2021 00:25 IST

కలరిపయట్టులో ప్రతిభ చూపుతోంది ఓ చిన్నారి. తన కళతో ఎందరో ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తనెవరు? ఈ కలరిపయట్టు కథేంటి? తెలుసుకుందామా!

ప్రపంచంలోనే తొలి యుద్ధ కళగా ప్రాచుర్యం పొందింది కలరిపయట్టు. కుంగ్‌ఫూ, తైక్వాండో వంటి మార్షల్‌ ఆర్ట్స్‌లో ఉండే మెలకువలన్నీ ఈ యుద్ధకళలోనూ ఉంటాయి. కత్తి, డాలు, కర్రలవంటి ఆయుధాలతో పోరాటం చేసే విధానాలపై ఈ కలరిపయట్టులో శిక్షణ ఇస్తారు. ఇక విషయానికొస్తే.. ఇదే కళలో అద్భుతమైన ప్రతిభ చూపిస్తోంది కొచ్చికి చెందిన నీలకందన్‌ నాయర్‌. వయసు పదేళ్లు. చదివేది అయిదో తరగతి.

నాన్న ప్రోత్సాహంతో..  

నీలకందన్‌ వాళ్ల నాన్న మహేష్‌ కుమార్‌. మిలిటరీ ఆఫీసర్‌. ఆయనకు కలరిపయట్టు నేర్చుకోవాలని ఉండేది. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా నేర్చుకోలేకపోయారు. అదే విషయం తమ ఇద్దరు కూతుళ్లకు చెప్పారు. అంతేకాదు వాళ్లిద్దర్నీ శిక్షణకు కూడా పంపించారు. ఆడపిల్లలు ఈ కళ నేర్చుకుంటే తమపై జరిగే దాడిని మెరుపువేగంతో అడ్డుకోవచ్చంటూ పదే పదే వాళ్ల నాన్న స్ఫూర్తినిస్తూ మాట్లాడేవారు. అదే నీలకందన్‌ మెదడులో నాటుకుపోయింది. అంతే అటు చదువుకుంటూనే ఇటు కలరిపయట్టులో శిక్షణ తీసుకుంది.

అలా ఫేమస్‌ అయింది..

ఆరేళ్ల వయసునుంచీ ఇందులో సాధన మొదలు పెట్టింది నీలకందన్‌. ఇక అరగంటలో 422 సార్లు వెనక్కి పల్టీలు కొట్టి ‘అరేబియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. అంతేనా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కడం తన ఆశయం అంటోంది. అందుకోసం నిరంతర సాధన చేస్తోంది. అన్నట్టు తను కలరిపయట్టు సాధన చేస్తున్నప్పుడు తీసిన వీడియో వైరల్‌ అయింది. దాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నీలకందన్‌ను మెచ్చుకుంటూ చేసిన ఈ పోస్టు ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఒక్కరోజులోనే ఈ చిన్నారి ఫేమస్‌ అయిపోయింది. ఎంతో మంది తన అద్భుతమైన కళను చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు దేశ విదేశాల నుంచి ఫోన్లు చేస్తూ ఆ యుద్ధకళ గురించి అడుగుతున్నారు. కొన్ని టాలెంట్‌ షోల నుంచి కూడా నీలకందన్‌కు ఆహ్వానాలు వస్తున్నాయి. చిన్న వయసులోనే ఇంత ఘన సాధించడం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని