‘తను’ ఓ రబ్బరు బొమ్మ!

‘ఒంట్లో ఎముకలున్నాయా? లేవా?.. కండరాల బదులు రబ్బరుందా ఏంటి?’ అని ఆ చిన్నారి చేసే విన్యాసాలు చూసినవాళ్లు నోరెళ్లబెట్టక మానరు. అంతలా ఒల్లును విల్లులా వంచుతుందీ బుడత.

Published : 17 Oct 2021 00:59 IST

‘ఒంట్లో ఎముకలున్నాయా? లేవా?.. కండరాల బదులు రబ్బరుందా ఏంటి?’ అని ఆ చిన్నారి చేసే విన్యాసాలు చూసినవాళ్లు నోరెళ్లబెట్టక మానరు. అంతలా ఒల్లును విల్లులా వంచుతుందీ బుడత. యోగాలో ఎంతో కష్టమైన ఆసనాలనూ చిటికెలో వేసేస్తోంది. రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతూ ముందుకు దూసుకుపోతోంది. మనలాంటి బుజ్జాయిలకూ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? ఆమె సాధించిన ఘనతలు ఏంటో తెలుసుకుందామా?

చిన్నారి పేరు తనుశ్రీ. ఉండేది ఉడుపిలో. ప్రస్తుతం 12 సంవత్సరాలు. తనకు తొమ్మిది సంవత్సరాలున్నప్పుడే ‘గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించేసింది. చేతుల ఆసరాగా శరీరాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ... రెండు కాళ్లనూ 42 సార్లు చుట్టూ తిప్పి ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డు సాధించడానికి ముందు, తర్వాత కూడా తను ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది.. కొడుతూనే ఉంది. నిత్యం యోగా సాధన చేస్తూ తనను తాను మెరుగుపరుచుకుంటూనే ఉంది.

భరతనాట్యంతో ప్రారంభమై... 

తనుశ్రీకి కేవలం మూడేళ్ల వయసున్నప్పుడే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. టీవీలో చూస్తూ సరదాగా యోగా కూడా నేర్చుకుంది. అమ్మానాన్నసాయంతో ఆసనాలు వేసేది. ఇప్పటి వరకు ఈ చిన్నారి దాదాపు 342 నృత్యప్రదర్శనలు ఇచ్చింది.

అలా మొదలైంది

మొదట్లో యోగా మీద అంతగా దృష్టిపెట్టలేదు.. కానీ యోగాలో ఓ చిన్నారి రికార్డు సాధించిందని తెలిశాక.. తను ఆ పని ఎందుకు చేయలేను అని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. అలా మొదటిసారిగా 2017లో నిర్మలంబ పూర్ణ చక్రాసనాన్ని నిమిషంలో 19 సార్లు వేసి ‘గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. తర్వాత 2018లో గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంది. ఇటీవలే 62 ఫార్వర్డ్‌ రోల్స్‌ కూడా చేసి ‘గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో పేరు లిఖించుకుంది. ఇలా ఇప్పటి వరకు ఓ పది, పన్నెండు ఘనతలు తన పేరిట ఉన్నాయి. తనకు వచ్చిన అవార్డులు, రివార్డులు వాళ్లింట్లో ఒక గది నిండా ఉన్నాయి. అయినా ఇక చాలు అనుకోకుండా.. ఇప్పటికీ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడంపైనే దృష్టి పెట్టింది. భవిష్యత్తులో తనుశ్రీ మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించుకోవాలని మనమూ మనసారా కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు