ఈ సైకిల్‌ అసలు పడిపోదు!

హాయ్‌ నేస్తాలూ! మీకు సైకిల్‌ తొక్కడం వచ్చా...! మనం నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కిందపడి ఉంటాం... కదూ! బ్యాలెన్సింగ్‌ వీల్స్‌ ఉన్నా... కొన్ని సార్లు కష్టమే... కానీ చైనాలో ఓ అంకుల్‌ సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ సైకిల్‌ తయారు చేశాడు.

Published : 18 Oct 2021 01:04 IST

హాయ్‌ నేస్తాలూ! మీకు సైకిల్‌ తొక్కడం వచ్చా...! మనం నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కిందపడి ఉంటాం... కదూ! బ్యాలెన్సింగ్‌ వీల్స్‌ ఉన్నా... కొన్ని సార్లు కష్టమే... కానీ చైనాలో ఓ అంకుల్‌ సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ సైకిల్‌ తయారు చేశాడు. అది అసలు కింద పడనే పడదట.. ఆ విశేషాలేంటో సరదాగా తెలుసుకుందామా!

చైనాకు చెందిన జియ్‌ హుయ్‌ జున్‌ అనే హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌, ఈ సెల్ఫ్‌బ్యాలెన్స్‌ సైకిల్‌ను తయారు చేశాడు. తనకు దొరికిన ఖాళీ సమయంలో ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాడు. ఇది పూర్తి కావడానికి సుమారు నాలుగు నెలలు పట్టింది. దీని తయారీకి శక్తిమంతమైన మోటార్లు, కెమెరాలు, సెన్సర్లను ఉపయోగించాడు. దీంతో సైకిల్‌ తనకు తానుగా బ్యాలెన్స్‌ చేసుకుంటుంది. పడిపోకుండా నియంత్రించుకుంటుంది.

కచ్చితంగా భయపడతారు..

మీకు కనుక విషయం తెలియకపోయి ఉందనుకుందాం కాసేపు. సెల్ఫ్‌బ్యాలెన్సింగ్‌ సైకిల్‌ వెళుతుంటే మీరు కచ్చితంగా భయపడతారు. ఎందుకంటే దీని మీద మనుషులెవ్వరూ లేకున్నా.. ఇది తనకు తాను బ్యాలెన్స్‌ చేసుకుంటూ.. బ్యాటరీల సాయంతో ముందుకు వెళ్లగలదు. ఇలా ఈ సైకిల్‌కు మూడు గంటల ప్రయాణానికి సరిపడా బ్యాటరీ బ్యాకప్‌ ఉంది. దీని దారిలో ఏమైనా ఇతర వాహనాలు, వస్తువులు అడ్డు వచ్చినా.. ఇది వాటి నుంచి తప్పుకొని మరీ వెళుతుంది. దీనికున్న కెమెరాలు, సెన్సర్ల వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఇలా వెళుతున్నప్పుడు ‘ఈ సైకిల్‌ను దెయ్యం ఏమైనా నడుపుతుందా.. ఏంటి?’ అని కొత్తవారు కాస్త అయోమయానికి, భయానికీ గురవుతారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు నేస్తాలూ..! ఈ సైకిల్‌ రివర్స్‌లో కూడా వెళ్లగలదు.

భవిష్యత్తులో...

ప్రస్తుతానికిది వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదు. ఏమో భవిష్యత్తులో మనం అసలు సైకిల్‌ నేర్చుకోవాల్సిన అవసరం లేదేమో! దాని మీద కూర్చుంటే చాలు.. అదే మనల్ని మనం కోరిన చోటుకు తీసుకువెళ్లొచ్చు. అంటే మన ముక్కు, మోకాలి చిప్పలకు తిప్పలు తప్పినట్లే! ఏది ఏమైనా ఈ సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ సైకిల్‌ సంగతులు భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని