Published : 20 Oct 2021 01:04 IST

ఇద్దరూ ఇద్దరే..!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఇరవై కాదు.. ముప్ఫై కూడా కాదు.. ఏకంగా ఎనిమిది వేల దరఖాస్తులు! చివరి వరకు నిలిచింది 20 మంది.. ఇందులో ఇద్దరు మనవాళ్లు! ఇంతకీ ఏంటిది?... ఓ ఎడ్యుకేషనల్‌ మ్యాగజైన్‌ వారు నిర్వహించిన ‘ఇండియా టాప్‌ 20 అండర్‌ 20’!   

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల వాళ్లు పోటీపడ్డ ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌కు చెందిన తరిణి పద్మనాభుని, హైదరాబాద్‌ వాసి విధి ఉన్నారు. అసలు ఈ పోటీ ఏంటి? వీళ్లు ఎలా విజయం సాధించారు? ఆ వివరాలన్నీ వాళ్ల మాటల్లోనే తెలుసుకుందామా!


ప్ర‘జల’ కష్టాలు తీర్చాలని!

మాది మహబూబ్‌ నగర్‌. ప్రస్తుతం బెంగళూరులో ఇంటర్‌ చదువుతున్నా. మా స్కూల్లో ‘ఇండియా టాప్‌ 20 అండర్‌ 20’ పోటీల గురించి మాకు చెప్పారు. నేను మ్యూజిక్‌, డ్యాన్స్‌, రైటింగ్‌లో పాల్గొన్నా. కరోనా కారణంగా ఈసారి పోటీ ఆన్‌లైన్‌ వేదికగా జరిగింది. మేం సాధించిన విజయాలేంటి? సమాజ సేవ గురించి అభిప్రాయం ఏంటి?... రైటింగ్‌ పోటీల్లో ఇలాంటి ప్రశ్నలు అడిగారు. చివరిగా ఓ వారం సమయమిచ్చి ఏదైనా ప్రాజెక్ట్‌ చేయమన్నారు. చాలా ఇళ్లల్లో ఆర్‌ఓ వాటర్‌ వాడటం సాధారణమే. మనం తాగే నీరు ఒక లీటరు తయారు కావాలంటే 4 లీటర్ల నీరు వృథా అవుతుంది. అంటే ఓ సాధారణ కుటుంబానికొచ్చేసరికి దాదాపు రోజుకు 64 లీటర్లు వృథా అవుతాయి. ఆ నీటితో దుస్తులు శుభ్రం చేసుకోవడానికి, అంట్లు తోముకునేందుకు వాడుకునేలా ఓ డిజైన్‌ తయారు చేశా. ఈ ఆలోచనను చుట్టుపక్కల వాళ్లకు వివరిస్తే 10 కుటుంబాల వాళ్లు ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టు నన్ను విజేతగా నిలిపింది.          

- తరిణి పద్మనాభుని


ఆరోగ్యం సహకరించకున్నా...

పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌. స్వస్థలం రాజస్థాన్‌. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఈ పోటీకి స్కూలు తరఫున నన్ను ఎంపిక చేశారు. నేను ఇప్పటికే రెండు పుస్తకాలూ రాశా. నా కవితలతోపాటు, మానసిక ఆరోగ్యం గురించి చిన్న చిన్న కథలతో బ్లాగూ నిర్వహిస్తున్నా. ఈ పోటీల్లో సెమీఫైనల్స్‌లో నా ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స తీసుకుంటూనే పాల్గొన్నా. నా ప్రతిభతో సమాజంపై ఏవిధంగా ప్రభావం చూపిస్తానన్నది టాస్క్‌. దీనికోసం బ్లాగులో ‘బుల్లీయింగ్‌’పై ఓ పోస్టు రాయడంతోపాటు స్కూల్లో ప్రోగ్రామ్‌లూ, రోడ్‌ షోలూ నిర్వహించా. ఫైనల్లో మళ్లీ అనారోగ్యం. మందులు వాడితే ఒళ్లంతా దద్దుర్లు, ఒకటే నొప్పి. అయినా భరించా. చివరకు పోటీలో గెలిచానని తెలియగానే చాలా ఆనందించా.      

- విధి
- నీరుకొండ అనూష, ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని