ఫొటో కొట్టాడు.. అవార్డు పట్టాడు!

హయ్‌ నా పేరు విద్యున్‌. మాది బెంగళూర్‌. అమ్మ నమిత, నాన్న రవిప్రకాష్‌. ప్రస్తుతం నేను అయిదో తరగతి చదువుతున్నాను....

Published : 23 Oct 2021 00:39 IST

ఓ పదేళ్ల బుడతడు ఫొటో తీశాడు.. అక్షరాల లక్షరూపాయలు గెలుచుకున్నాడు. అంతేనా తను తీసిన ఫొటోలతో ‘యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ -2021’   అవార్డు పొందాడు. ఎవరా బుడతడు? ఎలా సాధించాడు? అవన్నీ తన మాటల్లోనే విందాం రండి..

య్‌ నా పేరు విద్యున్‌. మాది బెంగళూర్‌. అమ్మ నమిత, నాన్న రవిప్రకాష్‌. ప్రస్తుతం నేను అయిదో తరగతి చదువుతున్నాను.

నాన్నే స్ఫూర్తి..
మా నాన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. అలాగే ఫొటోగ్రాఫర్‌ కూడా. ఆయన ఫోటోలు తీస్తే దానికి బహుమతి రావాల్సిందే! అంతలా నిశితంగా పరిశీలించి ఎంతో కష్టపడి తీస్తారు. అయితే ఏటా లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియం వారు ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌లు పెడుతూ ఉంటారు. అవి తెలుసుకున్న నాన్న 2014లో ఫొటోలు తీసి వాళ్లకు పంపించారు. అందులో మా నాన్నకు అవార్డు వచ్చింది. వెంటనే లండన్‌ రమ్మని పిలుపొచ్చింది.

అలా ఆసక్తి మొదలయింది..

అవార్డు తీసుకోవడానికి లండన్‌ వెళ్లినప్పుడు, నాన్న నన్ను కూడా తీసుకెళ్లారు. ఆయన దారిలో కెమెరాతో క్లిక్‌మనిపిస్తూ అద్భుతమైన చిత్రాలు తీసేరు. అవన్నీ చూసేసరికి నాకూ ఫొటోలు తీయాలనిపించింది. అప్పట్నుంచి ఆయన ఫొటోలు తీస్తున్నప్పుడు నిశితంగా పరిశీలించేవాడిని. నాకూ నేర్పించమని నాన్నని అడిగాను. అలా నాన్న దగ్గర మెలకులవలు నేర్చుకుంటూ ఫొటోలు తీయడం నేర్చుకున్నాను. కీటకాలు, బల్లులు, సీతాకోక చిలుకలు వంటి వాటిని ఫొటోలు తీయడమంటే నాకు భలే ఇష్టం. అయితే ఈ ఏడాది ఓ పది ఫొటోలు తీశాను. అవి చూసిన నాన్న చాలా బాగా తీశాను అని మెచ్చుకున్నారు. అంతేకాదు వాటిని తను పంపిన నేచురల్‌ హిస్టరీ మ్యూజియం వాళ్లకి పంపించుదాం అన్నారు. అయితే కాంపిటేషన్‌ చాలా టఫ్‌గా ఉంటుంది. అందుకే నేనేం చేశానంటే ఆ ఫొటోలతో పాటుగా రంగు రంగుల సాలీడుని కెమెరాలో బంధించాను. దీన్ని 30 నుంచి 35 సార్లు రకరకాల కోణాల్లో తీశాను. చివరికి ఒకటి బాగా వచ్చింది. దాన్ని కూడా జతచేసి పోటీకి పంపించాను. 96 దేశాలనుంచి 50 వేల ఎంటీల్రు వచ్చాయట. ఆశ్చర్యం ఏంటంటే నేను చివరిగా జత చేసిన ఫొటోకే మొదటి బహుమతి వచ్చింది. దాంతో ‘యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ -2021’ అవార్డును ఇచ్చేశారు. దీనికిగానూ 1000 బ్రిటిష్‌ పౌండ్స్‌(లక్ష రూపాయలు), నగదు బహుమతి ఇచ్చారు. అదన్నమాట సంగతి. భవిష్యత్తులో.. చదువుకుంటూనే ఫొటోగ్రఫీ రంగంలో మరింతగా ఎదగాలని కోరుకుంటున్నాను. మరి నాకు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతారు కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని