అన్నింటా మేటి!

ఎవరైనా ఒక రంగంలో అద్భుత ప్రతిభ చూపిస్తారు. కానీ ఈ నేస్తం అన్నింటిలోనూ తన సత్తా చాటుతోంది. ఆల్‌రౌండర్‌లా దూసుకుపోతూ అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రతి పోటీలో పాల్గొని పతకాలు అందుకుంటోంది....

Updated : 24 Oct 2021 05:07 IST

ఎవరైనా ఒక రంగంలో అద్భుత ప్రతిభ చూపిస్తారు. కానీ ఈ నేస్తం అన్నింటిలోనూ తన సత్తా చాటుతోంది. ఆల్‌రౌండర్‌లా దూసుకుపోతూ అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రతి పోటీలో పాల్గొని పతకాలు అందుకుంటోంది. ఈ చిచ్చరపిడుగు ఎవరు? ఆ వివరాలు మీకోసం..  

హైదరాబాద్‌కు చెందిన ఆ చిన్నారి పేరు బరిడె యష్ణ. వయసు ఏడేళ్లు. అమ్మానాన్న సుధీర్‌ కుమార్‌, రష్మీ. యష్ణ అన్నింటిలోనూ చురుకే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మరాఠీలో అనర్గళంగా మాట్లాడుతుంది. చక్కగా పాటలూ పాడుతుంది. పురాణ కథలు చెబుతుంది. ఆకట్టుకునే డ్రాయింగ్‌ వేస్తుంది. సినిమా పాటలు, డైలాగ్స్‌ చెబుతుంది. స్కేటింగ్‌ చేస్తూ వయొలిన్‌ వాయిస్తుంది. అందరూ ఆశ్చర్యపోయేలా స్టెప్పులు కూడా వేస్తుంది.

మూడేళ్ల వయసులోనే..
ఇన్నింటిలో ప్రతిభ చూపుతున్న యష్ణ ఎక్కడ శిక్షణ తీసుకుంటుందబ్బా అని ఆలోచిస్తున్నారా! అన్నింటికి గురువులు అమ్మానాన్నలే. వాళ్లు చెప్పినట్లు చేయడం, యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవడం ఇదే యష్ణ శిక్షణ. మూడేళ్ల వయసులోనే చిన్నారి యష్ణ పెయింటింగ్‌, డ్రాయింగ్‌, ఆర్ట్స్‌ పట్ల ఆసక్తి కనబరిచింది. ఇది గమనించిన అమ్మానాన్నలు శిక్షకులై తర్ఫీదు ఇచ్చారు. అతి తక్కువ సమయంలో నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో స్కేటింగ్‌ శిక్షణను కూడా అందించారు. యష్ణ.. స్కేటింగ్‌ చేస్తూ వయొలిన్‌ వాయిస్తుంటే.. చూసేవాళ్లు నోరెళ్ల బెట్టాల్సిందే. తన ప్రతిభతో ఇంటర్‌ స్కూల్‌ కాంపిటీషన్‌లో పాల్గొని బంగారు, వెండి పతకాలను సొంతం చేసుకుంది.

రికార్డులే రికార్డులు..
తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, సూపర్‌ కిడ్‌, వండర్‌ కిడ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. అన్నట్టు 2020-21 సంవత్సరానికి గాను బాలరత్న, ప్రతిభ అవార్డులూ అందిపుచ్చుకుంది. అంతేనా 2018, 2021లో ఇండియా కిడ్స్‌ ఫ్యాషన్‌ షోలో కూడా పాల్గొంది. అంతేకాదు.. రోబోటిక్స్‌లోనూ అవార్డు సాధించింది. భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే అనేక ఆవిష్కరణలు చేస్తానని, అదే తన లక్ష్యమని ధీమాగా చెబుతోంది. ఇంత చిన్నవయసులో ఇన్నింటిలో ప్రతిభ చూపడం అంటే మాటలు కాదు కదా! నిజంగా యష్ణ గ్రేట్‌ కదూ! మనం ఈ చిన్నారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి!

- జ్యోతి కిరణ్‌, ఈటీవీ, హైదరాబాద్‌ బ్యూరో


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని