‘అను’కొంది.. రికార్డు కొట్టింది!

ఓ అక్క కుడ్య చిత్రాలు గీసి రికార్డులు సృష్టిస్తోంది. అందరితో ప్రశంసలు అందుకుంటోంది.అటు చదువుకుంటూనే ఇటు చిత్రకళలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది.ఇంతకీ ఎవరీమె.తెలుసుకునేందుకు చదివేయండి.

Published : 25 Oct 2021 00:32 IST

ఓ అక్క కుడ్య చిత్రాలు గీసి రికార్డులు సృష్టిస్తోంది. అందరితో ప్రశంసలు అందుకుంటోంది.అటు చదువుకుంటూనే ఇటు చిత్రకళలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది.ఇంతకీ ఎవరీమె.తెలుసుకునేందుకు చదివేయండి.

కేరళలోని కన్నూర్‌కు చెందిన అను రియా, ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నప్పట్నుంచి బొమ్మలు వేయడమంటే ఆసక్తి చూపేది. మూడు సంవత్సరాల వయసునుంచే సొంతంగా బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. కుంచె పట్టుకుందంటే ఏదో ఒక దేవుడి బొమ్మ గీసేసేది. ఆ ఇష్టం కాస్తా అలవాటుగా మారింది. తన ఆసక్తిని గమనించిన అమ్మానాన్న పెయింటింగ్‌లో శిక్షణ ఇప్పించారు. అలా ఇప్పటి వరకు నటరాజన్‌, రాధామాధవులు, గణపతి, జీసస్‌వంటి దేవుళ్ల చిత్రాలు 54 వరకు గీసింది.


గోడలనే కాన్వాసుగా...

అను పెయింటింగ్‌ వేయడం మొదలు పెట్టాక తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడేది. అందుకే గోడలనే కాన్వాసుగా చేసుకుంది. గోడ మీద బొమ్మ వేయడం మాటలు కాదు. దానికి ఎంతో సాధన ఉండాలి. బొమ్మ వేయడానికి మెజర్‌మెంట్స్‌ సరిగా రావాలి. అందుకని చిత్రకారుడు శ్రీకునార్‌ కె ఎరామత్‌ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది. అలా మొదటగా 6.1 అడుగుల వెడల్పు, 10.4 అడుగుల పొడవు ఉన్న కుడ్య చిత్రాన్ని గీసింది. ఆ పెయింటింగ్‌కి బోలెడన్ని ప్రశంసలొచ్చాయి. ఆ ఉత్సాహంతో మరింత సాధన చేసి 64 చదరపు అడుగుల కుడ్య చిత్రాన్ని ఆవిష్కరించింది. అది కూడా కేవలం 5 రంగులను ఉపయోగించి వేసింది. అది చూసిన అందరూ అవాక్కయ్యారు. దీని కోసం అను చాలా కష్టపడింది. అటు చదువుకుంటూనే ఇటు పెయింటింగ్‌ వేసేది. తన కృషికి ఫలితంగా ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. త్వరలో తన దగ్గరున్న పెయింటింగ్‌లన్నింటితో ఎగ్జిబిషన్‌ పెడతానని, భవిష్యత్తులో చిత్రకారిణిగా ఎదగడమే తన లక్ష్యమనీ చెబుతోంది. మరి అను రియాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని