ఈ ఎలుగుబంటి ఓ యుద్ధవీరుడు!

రెండో ప్రపంచయుద్ధంలో ఓ ఎలుగుబంటి పాల్గొంది. సైనికులకు సాయం చేసింది. వారికి తల్లోనాలుకలా మారింది. ఓ రకంగా వారితో ఓ తోటి సైనికుడిగా మెలిగింది.

Published : 26 Oct 2021 01:04 IST

రెండో ప్రపంచయుద్ధంలో ఓ ఎలుగుబంటి పాల్గొంది. సైనికులకు సాయం చేసింది. వారికి తల్లోనాలుకలా మారింది. ఓ రకంగా వారితో ఓ తోటి సైనికుడిగా మెలిగింది. జనం హృదయాల్లో నిలిచిపోయింది. పలు దేశాల్లో ఆ ఎలుగుబంటి విగ్రహాలూ వెలిశాయి.

లుగుబంటిని చూడగానే.. అంతెందుకు దాని పేరు వినగానే మనం భయపడతాం. కానీ వోజ్‌టెక్‌ అనే ఎలుగుబంటి పేరు చెబితే మాత్రం కొన్ని దేశాల్లో దానికి సెల్యూట్‌ చేస్తారు! దీని పేరు మీద ఒక మెమోరియల్‌ ట్రస్టే ఉంది తెలుసా! అసలు ఈ ఎలుగుబంటి సైన్యంలోకి ఎలా వచ్చిందంటే... పోలీష్‌ సైనికులకు 1942 ప్రాంతంలో ఇరాన్‌లోని హమేడాన్‌ రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతంలో ఓ బుజ్జి ఎలుగుబంటి పిల్ల కనిపించింది. దాని తల్లి వేటగాళ్ల తూటాలకు ప్రాణాలొదిలింది. ఆ ఎలుగుబంటి పిల్లను పోలీష్‌ సైనికులు అక్కున చేర్చుకున్నారు. దాని సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. పోలాండ్‌లో తరుచుగా వినిపించే వోజ్‌టెక్‌ అని దానికి పేరు పెట్టారు.

ఆహారం తీసుకోవడానికీ ఇబ్బంది

చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన వోజ్‌టెక్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దానికి ఆహారం తీసుకోవడమూ సరిగా తెలిసేది కాదు. పోలీష్‌ సైనికులు దానికి చిక్కటి ఆవుపాలు, పండ్లు, తేనె ఆహారంగా ఇచ్చారు. నెమ్మదిగా ఇది పెరిగి పెద్దదైంది. దీనికి విచిత్రంగా ఉదయం కాఫీ తాగే అలవాటూ వచ్చింది.

సైనికుల్లో సైనికుడిగా..

సైనికులు దీనికి మనుషుల మాటలు అర్థం చేసుకునేలా చక్కగా శిక్షణ ఇచ్చారు. అది కాస్త పెద్ధైన తర్వాత బరువులు ఎత్తడంలో తర్ఫీదు ఇచ్చారు. యుద్ధరంగంలో మందుగుండు సామగ్రిని మోసి సైనికులకు సాయపడేలా దాన్ని తీర్చిదిద్దారు. దానికి సైన్యంలో ర్యాంక్‌, నంబర్‌ కూడా కేటాయించారు. యుద్ధక్షేత్రంలో ఉన్నప్పుడు అది సైనికులతోపాటే నిద్రించేది. సైనికులకు సెల్యూట్‌ కూడా చేసేది. సరదాగా వాళ్లతో కుస్తీ పట్లు కూడా పట్టేది. సైనికులను అనుకరిస్తూ కవాతు కూడా నేర్చుకుంది. నలుగురు సైనికులు కలిసి ఎత్తే పెట్టెలను ఇదొక్కటే సునాయాసంగా ఎత్తేది అన్నట్లు దీనికి ప్రమోషన్లు కూడా వచ్చాయి. ఇలా జవాన్లతోపాటే ఇది ఇరాక్‌, సిరియా, పాలస్తీనా, ఈజిప్టుకు వెళ్లింది.

యుద్ధం ముగిశాక

1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక దాన్ని స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌ జూకు తరలించారు. తర్వాత దీని గురించి పత్రికల్లో వార్తలు, కథనాలు వచ్చి చాలా ఫేమస్‌ అయింది. బీబీసీలో ప్రసారమయ్యే ‘బ్లూ పీటర్‌’ అనే చిన్నపిల్లల కార్యక్రమానికి చాలాసార్లు ఇది అతిథిలానూ హాజరైంది. 1963లో తన 21వ ఏట ఎడిన్‌బర్గ్‌ జూలో తుదిశ్వాస విడిచింది.

దేశదేశాల్లో స్మారకాలు

ఈ వోజ్‌టెక్‌ ఎలుగుబంటి స్మారకాలు లండన్‌లోని ఇంపీరియల్‌ వార్‌ మ్యూజియంలో ఉన్నాయి. ఇక విగ్రహాలైతే.. పోలాండ్‌లోని జోర్డాన్‌పార్క్‌, ఎడిన్‌బర్గ్‌లోని ప్రిన్సెస్‌ స్ట్రీట్‌ గార్డెన్స్‌, స్కాట్లాండ్‌ సరిహద్దులోని డన్స్‌ నగరం, పోలాండ్‌లోని జాగాన్‌ నగరాల్లో ఏర్పాటయ్యాయి. ఇలా ఈ ఎలుగుబంటి అక్కడి ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని